Thursday, February 28, 2013

ఉల్లిపాయతో వంటలు


ఉల్లిపాయతో వంటలు
ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని మించిపోతోందని ఇట్టే అర్థమవుతుంది. ఏ కూరగాయతో కూర వండాలన్నా ముందు కోయాల్సింది ఉల్లిపాయనే. వేరే కూరల వంటలకు ఉల్లిని జోడించడం కంటే నేరుగా ఉల్లిపాయతోనే వంటలు చేసుకుతింటే పోతుంది కదా అనుకునేవారికి ఈవారం వంటిల్లు నచ్చుతుంది. ఉల్లిపాయ కూర నుంచి పచ్చడి వరకూ కొన్ని వెరైటీ వంటలు ఇచ్చాం చూడండి.
ఉల్లిపాయ రింగులు: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - మూడు, మొక్కజొన్న పిండి - రెండు కప్పులు, శెనగపిండి - అర కప్పు, బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూను, వంట సోడా - చిటికెడు, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ఒక గిన్నెలో శెనగపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, వంట సోడా, కారం సరిపడా నీళ్లు పోసి గారెలపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఉల్లిపాయ చక్రాలను పిండిలో ముంచి నూనెలో వేసి వేగించి తీసేయాలి. అంతే ఆనియన్ రింగ్స్ రెడీ అయినట్టే.

ఉల్లిపాయ బజ్జీలు: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - రెండు, కోడిగుడ్లు - రెండు, శెనగపిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, కారం - ఒక టీ స్పూను, సోడా - చిటికెడు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ఉల్లిపాయల్ని సన్నగా చక్రాల్లా కోసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, ధనియాల పొడి, కారం, సోడా, సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కోడి గుడ్ల సొన కూడా వేసి బాగా కలపాలి. పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ చక్రాలు పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక దించేయాలి.

బ్రెడ్ ఉల్లిపాయ: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - రెండు, బ్రెడ్ ముక్కలు - ఐదు, వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, పాలు - అర కప్పు, కోడి గుడ్డు తెల్లసొన - ఒకటి, ఉప్పు - తగినంత, మైదా పిండి - అర కప్పు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ఒక గిన్నెలో పాలు, కోడి గుడ్డు తెల్లసొన, మైదా పిండి, ఉప్పు, వెల్లుల్లి ముద్ద, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. అందులో చక్రాలుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పది నిమిషాల తర్వాత అందులోని ఉల్లిపాయ ముక్కల్ని తీసి బ్రెడ్‌పొడిలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి వేగించాలి.

ఉల్లిపాయ కూర: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు(చిన్నవి) - ఎనిమిది, టమాటాలు - మూడు, పచ్చిమిరపకాయలు - రెండు, ఎండుమిరపకాయలు - రెండు, కారం - ఒక టీ స్పూను, ఆవాలు, కరివేపాకు - ఒక రెబ్బ, జీలకర్ర - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా టమాటాలను ఉడకబెట్టి తొక్కతీసి గుజ్జుని మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి. తర్వాత టమాటా గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తర్వాత, తొక్కవొలిచిన ఉల్లిపాయలు వేసి సన్నమంటపై మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడ్డాక కూరని దించేయాలి.

ఉల్లిపాయ చెట్నీ: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - మూడు, పచ్చిమిరపకాయలు - ఆరు, జీలకర్ర - ఒక టీ స్పూను, కొత్తిమీర - ఒక కట్ట, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి రేకలు - నాలుగు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి వేగించాలి. వేగాక దించేసి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు,కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేగించి ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి.

1 comments:

  1. nice blog sukanya, manchi vantalanu ichaaru, vatalu nerchukovaalanukonevaariki chala manchi blog , Thanks

    ReplyDelete