Thursday, July 24, 2014

టొమేటో గ్రేవీ ఆలూ గుత్తివంకాయ



కావలసినవి:  గుత్తివంకాయకు వాడే వంకాయలు – 6, ఆలుగడ్డ – 1, ఉల్లిపాయలు – 4, టొమేటోలు – 4, కేరట్ – 1, ఉడికించిన పచ్చి బటానీలు, ఎర్రకారం, ఉప్పు, ఒక స్పూను MTR సాంబారు పొడి, కొంచెం జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర.
తయారు చేసే విధానం:  వంకాయలు గుత్తిగా కొయ్యాలి. ఆలుగడ్డ, ఉల్లిపాయలు ముక్కలుగా తరుగుకోవాలి.
స్టౌ వెలిగించి మూకుడు పెట్టి, నూనె, నీళ్ళు కలిపి వెయ్యాలి.  అందులో గుత్తివంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి, మూత పెట్టి సన్నమంట మీద మగ్గనివ్వాలి.  తరువాత వీలును బట్టి మంట పెద్దది చేసుకోవచ్చు.  నీళ్ళన్నీ ఇగిరిపోయి నూనెలో వున్నట్లే వుండి మెత్తగా మగ్గుతాయి.  నాలుగు టొమేటోలు, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎర్రకారం మిక్సీలో రుబ్బి, ఆ గ్రేవీ కూరలో వేసి ఉడికించి, బటానీలు, కొత్తిమీర జల్లి కలియపెట్టాలి.  అప్పుడు ఒక స్పూను MTR సాంబారుపొడి చల్లాలి.  తరవాత పైన కేరట్ తురుము వెయ్యాలి.  ఈ కూర చాలా తేలికగా చిటికెలో అయిపోతుంది.  అతిథులొచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది.

ఫ్రూట్ కస్టర్డ్

కావలసిన పదార్ధాలు : 1. పండ్లు 5,6 రకాలుచిన్నగాముక్కలుచెయ్యాలి.
[మామిడి,అరటి,యాపిల్,కమలా,ద్రా
క్ష,బొప్పాయి,దానిమ్మ.] నీరు వుండే పండ్లు అనగా పుచ్చకాయ లాంటివి పనికి రావు.2. బాదం ,జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ చిన్నముక్కలుగా చేసుకోవాలి. 3.పంచదార అరకిలో ,4. చిక్కటి పాలు ఒక లీటరు , 5.విక్ ఫీల్డు కస్టర్డ్ పౌడర్ 5 sp.

చేయువిధానం : పాలు బాగా మరగ నివ్వాలి. మరుగుతున్నప్పుడే అందులో చక్కెరవేసి బాగా కలుపుతూ వుండాలి. ఒక కప్పులో అరగ్లాసు చల్లని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి.వేడి పాలల్లో వేస్తే ఉండలు కట్టి ,గట్టిపడతాయి. పొరపాటున కూడా అలా చేయరాదు. కస్టర్డ్ కలిపిన చల్లటి పాలను జాగ్రత్తగా పోస్తూ, బాగా కలుపుతూ వుండాలి. లేకపోతే అడుగున ఉండలు కట్టి మాడిపోయి , కాటు వాసన వస్తుంది. పదార్ధం పూర్తిగా పాడయిపోతుంది . బాగా కలుపుతూవుంటే పాలు చిక్కగా అవుతాయి. స్టవ్ కట్టేసి , కలుపుతో,(మీగడ కట్టకుండా ) చల్లారనివ్వాలి. చల్లారాక ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
పండ్లని బాగా కడిగి ,శుభ్రం చేసి ,పొట్టు తీసి చిన్నముక్కలు చేసుకోవాలి. అరటి పండ్లు మాత్రం తినడానికి ముందు మాత్రమే కలపాలి.నల్లబడతాయి . పండ్ల ముక్కలమీద అరచెంచా నిమ్మరసం కలిపి ఫ్రిజ్ లో ఉంచితే చల్లగా వుంటాయి . 2,3 గంటలతరువాత కస్టర్డ్ లో పళ్ళముక్కలు ,డ్రై ఫ్రూట్ ముక్కలూ కలిపి , అందమైన గాజు బౌల్ లో పిల్లలకి అందించండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ,ఎండలు బాగా వున్నాయి కాబట్టి ,స్కూల్ నుండి రాగానే చల్లగా మాంగో ఫ్రూట్ కస్టర్డ్ ఇస్తారుకదూ..

స్వీట్స్ (ఉషారాణి నూతలపాటి )రసగుల్లా

కావలసిన పదార్ధాలు : చిక్కటి పాలు 1 లీటరు , పంచదార అరకిలో ,నిమ్మరసం 1 పెద్దకాయ రసం , చిటికెడు  కుంకుమ పువ్వు , పిస్తా పప్పు కొద్దిగా. (పిస్తా ,కుంకుమ పువ్వు కావాలనుకుంటేనే వాడవచ్చు.)
చేయువిధానం : ముందుగా పాలని బాగా మరగనివ్వాలి. పాలు కాగినంతసేపు మీగడ కట్టకుండా కలుపుతూనేవుండాలి .బాగా మరిగినతరువాత స్టవ్ కట్టేసి , నిమ్మరసం లో ఒక స్పూన్ నీళ్ళు కలిపి , ఆ నిమ్మరసాన్ని పాలల్లో కొద్ది,కొద్దిగా కలుపుతూ వుండాలి .పాలు విరిగేవరకు అలా కలుపుతూ వుంటే పాలు విరిగిపోతాయి . విరిగిన పాలని అలాగే కలిపితే పాలు బాగా విరిగి , నీరు,విరుగు (చెనా ) స్పష్టంగా వేరుపడతాయి . చిల్లుల పళ్ళెం లో పల్చని బట్టవేసి అందులో పాలవిరుగు వెయ్యాలి . చెనా మీద బాగా నీటిని ధారగా పొయ్యాలి ,అప్పుడే నిమ్మరసం పులుపు కూడా పోతుంది. బట్టలోంచి నీరు మొత్తం దిగిపోతుంది. బట్టను మూటలా చేసి ,తేలికగా వత్తితే మిగిలిన నీరు కూడా బయటికి వస్తుంది. 2 గంటలసేపు ఆమూటను వేలాడదీస్తే మొత్తం నీరు దిగిపోయి ,చెనా మిగులుతుంది.
ఇప్పుడు స్టవ్ పైన మందపాటి పాత్రను వుంచి అరలీటరు నీరు పోసి, అందులో చక్కర వేసి , కరిగేవరకూ కలుపుతూ వుండాలి . బాగా కరిగిన తరువాత చక్కెరపాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి .
చెనా (పాలవిరుగు) ని ఒక పెద్ద ప్లేట్ లో కానీ ,చపాతీ పీటమీద కానీ వేసుకొని , మృదువుగా ,ఉండలు లేకుండా 5.6 నిముషాలసేపు కలపాలి. మృదువుగా ,వుండచేస్తే తేలికగా వుండకట్టేలా తయారు అవుతుంది. మొత్తం చెనాని సమానభాగాలుగా చేసి ,గుండ్రగా ఉండలు చెయ్యాలి. ఒక వెడల్పు పాత్ర స్టవ్ పై వుంచి లీటరు నీరు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో చెనావుండలు వేసి మూత పెట్టాలి. 7 ,8 నిముషాలపాటు అలాగే మరగనివ్వాలి .చెనావుండలు బాగా ఉడికి సైజ్ పెద్దగా అవుతాయి వాటిని పాకంలో వేసి చల్లారాక ,ఫ్రిజ్ లో వుంచి చల్లబరచాలి.పాకంలో కావాలనుకుంటే కుంకుమ పువ్వు (శాఫ్రాన్ )వేసుకోవచ్చు.పిస్తా సన్నగా తరిగి రసగుల్లాలమీద అలంకరించుకుంటే అద్భుతః .పాకంలో 2 చుక్కలు వనిల్లా ఎసెన్స్ (కావాలనుకుంటే )లేదా రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మంచి వాసనతో రుచిగావుంటాయి.
P.S. : ఒక్కోసారి పాలు విరిగిపోతాయి.అప్పుడు కూడా ట్రై చెయ్యవచ్చు. కానీ మరీ పాడయిన పాలు చేదువస్తాయి జాగ్రత్త !!

Monday, July 14, 2014

క్రిస్పీ కట్లెట్స్

క్రిస్పీ కట్లెట్స్

రెండు కప్పులు మిగిలిన అన్నం,                రెండు టేబుల్ స్పూన్ల శెనగ పిండి,
ఒక టేబుల్ స్పూన్ పెరుగు,                     రెండు పచ్చి మిరప కాయలు,
మూడు వెల్లుల్లి పాయలు,                        చిన్న అల్లం ముక్క,
( ఇష్టం లేనివారు మానెయ్య వచ్చు),           అర కప్పుడు తరిగిన కొత్తిమిరి,
ఒకొక్క టీ స్పూన్ కారం, ధనియా పొడి, పంచదార,
అర కప్పుడు వేరుసెనగ గింజలు, (అంటే పల్లీలు)
తగినంత ఉప్పు చిటికెడు పసుపు,               రెండు టేబుల్ స్పూన్ల నూని,
వేయించు కొనేందుకు కొద్దిగా నూని ( షాలో ఫ్రై కి ).

మధ్యాన్నం భోజనాల తరువాత మిగిలిన అన్నాన్నీ ఒక బౌల్ లో వేసి, దాన్లో పెరుగు, శెనగ పిండి, ఉప్పు పసుపు వేసి బాగా చేత్తో పిసికి మూత పెట్టి వదిలేయాలి. రెండు మూడు గంటలు నానితే బాగుంటుంది. టిఫిన్ రెడీ చేసే అరగంట ముందు దాన్ని తెసి బాగా పిసుక్కోవాలి. పల్లీలు, మిర్చి, వెల్లుల్లి కొత్తిమిరి కలిపి ముద్దలా చేసుకోవాలి. దాన్ని, నూనే, కారం, ధనియా పొడి, పంచదారల తో పిండిలో వేసి కలుపు కోవాలి. పల్చగా అనిపిస్తే కొచెం శెనగ పిండి కలుపుకోవచ్చు.  ఇంచుమించు పకోడీ పిండిలా ఉంటుంది. పాన్ వెచ్చ చేసీ కొంచెం నూనె వేసి దాంట్లో, కట్లెట్స్ షేప్ లో చేత్తోతట్టి వేయించు కోవాలి. టమాటో సాస్ గాని గ్రీన్ చట్ని తో గాని సర్వ్ చెయ్యండి.
లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటై.

కాకరకాయ సాంబార్

కాకరకాయ సాంబార్ కి కావల్సిన పదార్థాలు:
చిన్నగ్లాసు కందిపప్పు, కాకరకాయ 1, ఒక స్పూను MTR సాంబారు పొడి, ఇంగువ, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, చింతపండు, ఉప్పు.
తయారు చేసే విధానం:
          చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి.  కాకరకాయ చక్రాల్లా తరుగుకోవాలి.  స్టౌ వెలిగించి కుక్కరులో పప్పు ఉడికించుకోవాలి.  మూకుడులో నూనె వేసి కాకరకాయముక్కలు బాగా ఎర్రగా వేయించాలి.  వేగాక చింతపండు పులుసు పోసి, ఉప్పు, పసుపు వేసి, అందులో ఉడికిన పప్పు వేసి ఉడికించాలి.  ఆఖర్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, రెండు పచ్చిమిర్చి పోపులో వేయించి, కొంచెం ఎర్రకారం వేసి పులుసులో కలపాలి.  కావాలంటే కొత్తిమీర కూడా వెయ్యచ్చు.

Thursday, July 3, 2014

Usharani Nutulapati -చామదుంపఅంటుపులుసు-

ఇది చెయ్యడానికి కావలసిన పదార్ధాలు చూద్దాం.

కావలసిన పదార్ధాలు : చామదుంపలు ¼ కిలో , చింతపండు 20 గ్రా.,నూనె 2 sp., బియ్యప్పిండి 1 sp ., బెల్లం చిన్నముక్క,ఇంగువ పావుచెంచా ,జీలకర్ర మెంతుల పొడి 1 sp ,అల్లం వెల్లుల్లి పేస్ట్ ,గరంమసాలా1 sp,ఉల్లితరుగు
1 కప్పు ,కర్వేపాకు,కొత్తిమీర,పోపుదినుసులు, కారం ,ఉప్పు తగినంత.

చేయువిధానము : చామదుంప లు బాగా కడిగి ,కుక్కర్లో మూడు విజిల్స్ రానివ్వాలి. చల్లారాక పొట్టువలిచి వుంచుకోవాలి.పాన్ వేడి చేసి 2 sp నూనె వెయ్యాలి. నూనె వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించాలి. మసాలా ఇష్టమైన వారు అల్లం వెల్లుల్లి ముద్ద ,ఇష్టం లేని వారు ఇంగువ వేసుకోవాలి.కరివేపాకు కూడా వేసి ,తరువాత చామదుంపలు +పసుపు వేసి వేయించాలి. 3 ని బాగా కలిపి ,చింతపండు రసం చిక్కగా తీసి ముక్కలపైన పోయాలి.పులుసు ఉడుకు పట్టగానే, బియ్యప్పిండి లో నీళ్ళు కలిపి ,అందులోనే జీలకర్ర మెంతులపొడి , బెల్లం తురుము, ఉప్పు, కారం కూడావేసి ,పులుసుకు కలపాలి. మసాలా ఇష్టమైన వారు ఒక sp.గరం మసాలా పొడి వేసుకోవాలి.పులుసు చిక్కగా ,ఘుమ ఘుమ లాడుతూ తయారు అవుతుంది. కొత్తిమీర చల్లుకుంటే చామదుంప అంటు పులుసు రెడీ..అన్నం లోకి ,రోటీల్లోకి కూడా బావుంటుంది.