Wednesday, September 30, 2015

బైంగన్ భర్తా

కావలసిన పదార్థాలు:
1. పెద్ద వంకాయ మెత్తగా లేకుండా ఉన్నది ఒకటి (పుచ్చు ఉందో లేదో చూడటానికి మధ్యలో చాకుతో నాలుగు దిక్కులా గాట్లు పెట్టి కొద్దిగా తెరచి చూడవచ్చు)
2. పావుకిలో టమాటోలు
3. రెండు మధ్య సైజు ఉల్లిపాయలు
4. రెండు పచ్చిమిరపకాయలు
5. కాస్త తురిమిన అల్లం
6. ఫ్రోజెన్ బఠానీలు
7. ధనియాల పొడి
8. జీలకర పొడి
9. వెల్లుల్లి పేస్టు
10. తగినంత ఉప్పు, కారం, గరం మసాలా
11. వంట నూనె
12. తరిగిన కొత్తిమీర
13. తురిమిన బటర్ (వెన్న)
గమనిక: ఈ వంటకంలో వెల్లుల్లి, బఠానీలు , గరం మసాలా వేసుకోకపోయినా బానే ఉంటుంది. మీ ఇంట్లో వెల్లుల్లి, మసాలా తినే అలవాటు ఉంటే, బఠానీల రుచి నచ్చితే వేసుకోండి. మా ఇంట్లో మా నాన్నగారు తినరు. కాబట్టి వేయలేదు. బఠానీలు అందరికీ ఇష్టం. వేశాను.
తయారు చేసే విధానం:
ముందుగా వంకాయను బాగా కడిగి శుభ్రమైన గుడ్డతో లేదా పేపర్ టవలుతో తుడవండి. పెద్ద వంకాయలు మెరవటానికి పైన మైనం వగైర పూస్తారు కూరగాయల వ్యాపారులు. అది ఒకటి రెండు సార్లు శుభ్రం చేస్తే గానీ పోదు. తుడిచిన వంకాయపై వేళ్లతో నూనెను పూయండి. ఎక్కువ అక్కరలేదు. అల్యూమినియుం ఫాయిల్ ఉన్నవాళ్లు దాన్ని గట్టిగా చుట్టి పొయ్యిమీద పెట్టి కాల్చండి. నేరుగా కూడా పొయ్యి మీద పెట్టి కాల్చుకోవచ్చు. కాడ ఊడకుండా జాగ్రత్తగా నాలుగువైపులా మంట తగిలేలా ఒకటి రెండు సార్లు తిప్పి ఒక ఐదు నిమిషాలు మంటపై కాల్చండి. లోపల ఉడికింది అన్నదానికి సంకేతం మీరు పెట్టిన గాట్లలోనుండి ఆవిరి రావటం. లేదా కాయ సైజు తగ్గినట్లుగా కనిపించి చర్మం ముడతలు పడటం. వంకాయ లోపలి కండ మెత్తబడకపోతే కూర చేదుగా ఉంటుంది. ఇలా నిర్ధారించుకోగానే ఆ కాలిన కాయను ఒక చన్నీళ్లు ఉన్న పాత్రలో వేయండి. ఫ్రోజెన్ బఠానీలు వేయదలచిన వాళ్లు వాటిని కాసిని నీళ్లలో వేసి ఉంచండి. ఐసు కరిగి శుభ్రం చేసుకోవటానికి సిద్ధమవుతాయి.
ఈలోపల ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి. బాణలిలో నూనె వేసి, వేడి అయిన తరువాత అందులో కాస్త జీలకర్ర వేయండి. ఈ కూరకు నూనె ఎక్కువ వేయనక్కరలేదు. అవి దోరగా వేగిన తరువాత (వెల్లుల్లి మరియు) అల్లం మిశ్రమం వేయండి. ఇవి కాస్త వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిముక్కలు ఎరుపు రంగు వచ్చిన తరువాత పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కడిగిన బఠాణీలు వేసి సన్న సెగన ఒక 7-8 నిమిషాలు ఉడికించండి. టమాటో పులుపు ఉల్లిముక్కలకు పట్టి మంచి గ్రేవీలా తయారయ్యేదాక ఉడికించండి. చల్లబడిన కాలిన వంకాయ పొట్టును ఒలవండి. చాకుతో కాయ గుజ్జును ముక్కలు చేయండి. దీనిని ఉల్లి-టమాటోల మిశ్రమంలో వేసి, తగినంత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు పాటు తిప్పుతూ ఉడకనివ్వండి. దించేముందు తురిమిన బటర్, తరిగిన కొత్తిమీరను వేసి ఒక నిమిషం వేడి మీద ఉంచండి. తరువాత కూరను పాత్రలో వేసుకోండి. ఈ కూరలో ప్రధానంగా వంకాయ గుజ్జు రుచి. మధురంగా ఉంటుంది. వేడివేడిగా పుల్కాలు లేదా చపాతీలతో తింటే బాగుంటుంది. అన్నంతో కూడా తినవచ్చు.

గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్

ఎప్పుడూ బంగాళాదుంప లేద మిరపకాయ బజ్జీలో తిని విసుగ్గా ఉందా? అయితే ఈసారి గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్ వండి తినండి. మీకు నచ్చుతుంది.

కావలసిన పదార్థాలు: 

1. బేబీ కార్న్ (లేత మొక్క జొన్న - 3-4 అంగుళాల పొడవు ఒక సెంటిమీటెర్ వ్యాసం ఉంటాయి) 
2. తగినంత శనగపిండి, కాస్త బియ్యప్పిండి
3. మీకు బాగా కరకరలాడేటాట్లు రావాలంటే వంట సోడా
4. తగినంత ఉప్పు,కారం
5. కాస్త జీలకర్ర
6. వేయించటానికి నూనె
7. టమాటో కెచప్ లేదా చిల్లీ సాస్ లేదా చింతపండు-ఖర్జూరాల చట్నీ

ముందుగా బేబీ కార్నులను నిలువుగా మధ్యలో కోసి వేడి నీటిలో ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్యకు కోయటం వలన లోపల కూడా కాస్త ఉడుకుతుంది. ముక్కలు ఒకింత మెత్తబడగానే తీసి పక్కన పెట్టుకోండి. రైసుకుక్కరులో ఆవిరిలో వండే వసతి ఉన్నవాళ్లు దానిలో కూడా ఒక 2 నిమిషాలు ఈ ముక్కలను ఉడికించుకోవచ్చు.

శనగపిండి-బియ్యప్పిండి కలిపి దానిలో ఉప్పు,కారం, జీలకర్ర, వంట సోడా వేసి నీళ్లు పోసి జారుగా పకోడీ పిండి కలుపుకోండి. పిండి గడ్డలు లేకుండా మెత్తగా చేతితో కానీ, మిక్సీలో కానీ నలుపుకోండి. బాణలిలో నూనె పోసి కాచుకోండి. వేడినీళ్లలో కాస్త ఉడికిన బేబీకార్నును ఈ పిండిలో వేసుకొని ఎక్కువ పిండి ముక్కకు పట్టకుండా గిన్న అంచులకు ముక్కను అద్ది వేడినూనెలో వేయండి. ఒక్కొక్క వాయి దాదాపు 1-2 నిమిషాలు వేగిన తరువాత ముక్కలు గోల్డెన్ రంగులోకి మారతాయి. వాటిని తీసి ఒక ప్లేటులో పాపరు టవల్లో వేసి ముక్కలకున్న నూనెను తుడుచుకొని ఒక గిన్నెలో బేబీకార్న్ వేసుకోండి. వీటిని వేడిగా టమాటో కెచప్ లేదా చిల్లీ సాస్ లేదా చింతపండు-ఖర్జూరాల చట్నీతో తినవచ్చు.

గమనిక - ఈ చిత్రం ఇంటర్నెట్ లోది. నేను చేసినప్పుడు చిత్రం తీయటం మర్చిపోయాను. సరదగా వీటిమధ్యలో టూత్ పిక్స్ గుచ్చి చేతులకు నూనె అంటకుండా తినవచ్చు.

సజ్జ రొట్టె

సజ్జలు కూడా చిరు ధాన్యాలె ..మిల్లెట్స్ అన్నమాట . హిందీలో బాజ్రా అంటారు . ఇంగ్లిష్ లో పెర్ల్ మిల్లెట్ ( Pearl Millet ) అంటారు . సజ్జలలో కాల్షియం , ఐరన్ , ఫైబెర్ చాలా ఎక్కువగా ఉంటాయి . కొద్దిగా వేడిచేసే గుణం ఉంటుంది. రుచి చాలా బావుంటుంది . పంజాబీలు " బాజ్రేకీ రోటీ , సర్సొందా సాగ్ " అంటూ ..వాళ్లకి ఇష్టమైన కాంబినేషన్ చెప్తారు . అంటే సజ్జరోట్టే , ఆవాల ఆకు తో చేసే కూర .. చాలా బావుంటుంది . అయితే వాళ్ళు చేసినంత పల్చటి రొట్టె కాకపోయినా .. కొద్దిగా నూనె , ఇతర పదార్ధాలతో , తెలంగాణా " సద్ద రొట్టె " మా అమ్మ చేసేది . అదే నాకు చాలా ఇష్టం . ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను .
సజ్జలు సూపర్ మార్కెట్లో అయితే శుభ్రంగా ఉంటాయి . బయట మండీ లలో అయితే శుభ్రం చేసి , కడిగి ఎండబెట్టి పిండి పట్టించుకోవాలి . కావలసినంత పిండి ( పావు కిలో పిండికి , 3,4 రొట్టెలు అవుతాయి )
పిండి , వెడల్పైన బౌల్ లోకి తీసుకోవాలి . ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , కరివేపాకు , ఉప్పు
, కొత్తిమిర కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి . చిన్న లేత సొరకాయ ముక్క తురిమి పిండికి కలిపి , గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి , నీళ్ళతో ముద్దగా చేసుకోవాలి . చపాతి
పిండిలా గట్టిగా ఉండదు .. మృదువుగా ఉంటుంది పిండి . ఆపిండిని నాలుగు
సమాన భాగాలుగా ముద్ద చేసుకోవాలి .
ఒక్కొక్క ముద్ద బత్తాయి కాయ సైజ్ లో ఉంటుంది . ప్లాస్టిక్ పేపర్ , లేదా ఆయిల్ కవర్ కట్ చేసి , (లోపలివైపు వాడుకోవచ్చు )
దానికి కొద్దిగా నూనేరాసి సజ్జ పిండి ముద్ద రొట్టె లాగా వత్తుకోవాలి . మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే ఉండాలి . పెనం వేడి చేసి ఒకస్పూన్ నూనె వేసి రొట్టె వెయ్యాలి . కొద్దిగా కాలిన తరువాత రెండో వైపు తిప్పాలి . బాగా కాలిన తరువాత తీసెయ్యాలి .
దీనికి కాంబినేషన్ గా ఉల్లిపాయ కారం , వెన్న
/ పేరిన నెయ్యి వేసుకొని తినాలి .
ఉల్లిపాయలు రెండు , సరిపడా ఉప్పు , కారం . కొద్దిగా చింతపండు కలిపి కచ్చా , పచ్చాగా నూరెయ్యడమే ..

Tuesday, September 29, 2015

• ఉలవల కారప్పొడి

కావల్సినవి:
ఉలవలు - అరగ్లాసు, ధనియాలు - గ్లాసు, ఎండుమిర్చి - ఇరవై, కరివేపాకు - ఐదు రెబ్బలు, మినప్పప్పు - రెండు చెంచాలు, చింతపండు - నిమ్మకాయంత, ఆవాలు - అరచెంచా, జీలకర్ర - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - మూడు చెంచాలు.

తయారీ:
బాణలిలో ఉలవల్ని వేసి నూనె లేకుండానే కరకర లాడే వరకూ వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో చెంచా నూనె వేడిచేసి ధనియాలూ, కరివేపాకూ వేయించుకుని తీసుకోవాలి. తరవాత మినప్పప్పూ, చింతపండూ, ఆవాలూ వేయాలి. అవి వేగాక ఎండుమిర్చి కూడా వేయించి, జీలకర్ర వేసి పొయ్యికట్టేయాలి. పదార్థాలన్నీ చల్లారాక సరిపడా ఉప్పూ, ఈ తాలింపూ, ఉలవలూ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ కారప్పొడి వారం వరకూ తాజాగా ఉంటుంది.

• ఉలవల రొట్టె

కావల్సినవి: 
బియ్యప్పిండి - గ్లాసు, ఉలవలు - అరగ్లాసు, ఉప్పు - సరిపడా, నూనె - అరకప్పు, జీలకర్ర - చెంచా, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - కట్ట.

తయారీ:
ఉలవల్ని మూడుగంటల ముందుగా నానబెట్టుకోవాలి. తరవాత ఉడికించుకుని తీసుకోవాలి. బాణలిలో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అందులోనే ఉప్పూ, జీలకర్రా, తరిగిన పచ్చిమిర్చీ, కొత్తిమీర వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఉడికించిన ఉలవలు వేయాలి. రెండునిమిషాల తరవాత దింపేయాలి. ఈ నీటిని బియ్యప్పిండిలో కొద్దికొద్దిగా వేసుకుంటూ గట్టి ముద్దలా కలపాలి. ఇప్పుడు పెనాన్ని పొయ్యిమీద పెట్టి, దానికి కొద్దిగా నూనె రాయాలి. పెనం వేడయ్యాక మంట తగ్గించి.. ఈ పిండిని కొద్దిగా తీసుకుని చేత్తో రొట్టెలా తట్టుకుని పెనంపై వేసి కొద్దికొద్దిగా నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.

• ఉలవల దాల్‌మఖానీ

• ఉలవల దాల్‌మఖానీ 

కావల్సినవి: 
ఎర్ర ఉలవలు - కప్పు, ఉల్లిపాయలు - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, కారం - చెంచా, పచ్చిమిర్చి - రెండు, టొమాటో - ఒకటి, వెన్న - అరకప్పు, ధనియాలపొడి - చెంచా, కొత్తిమీర - కట్ట, పసుపు - చిటికెడు, గరంమసాలా - చెంచా, మీగడ - అరకప్పు, నూనె - అరకప్పు.

తయారీ:
ఉలవల్ని నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె, ముప్పావు వంతు వెన్నా వేయాలి. వెన్న కరిగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక పసుపూ, అల్లంవెల్లుల్లి పేస్టూ, పచ్చిమిర్చీ, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. తరవాత ఇందులో ధనియాలపొడి, నానబెట్టిన ఉలవలూ, ఉప్పూ వేసి బాగా కలిపి మూడు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఎనిమిది లేదా తొమ్మిది కూతలు వచ్చాక దింపేయాలి. విజిల్ తీసేసి ఉడికిన ఉలవల్ని మెత్తగా మెదపాలి. ఇప్పుడు చిన్న బాణలిలో మిగిలిన వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక గరంమసాలా, కారం వేయాలి. నిమిషం తరవాత ఆ వెన్నను ఉలవల మిశ్రమంలో వేసేయాలి. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, మీగడ వేసి కలిపితే సరిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, చపాతీల్లోకీ బాగుంటుంది.

Tuesday, September 22, 2015

వెజ్ మంచూరియా

కావలసినవి:
క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, పచ్చిమిర్చి తరుగు - 2 కప్పులు, ఉల్లికాడల తరుగు - 1 కప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు, సోయాసాస్ - 2 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - 6 టీ స్పూన్లు, మిరియాలపొడి, పంచదార - టీ స్పూన్, అజినమోటో - చిటికెడు, నూనె - డీప్ ఫ్రై కి సరిపడా, టోమాటో సాస్ - రెండు స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత
తయారి:
ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగాక మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వేరే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక అందులో అల్లం వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. తరవాత వేయించుకున్న మంచూరియాలను వేసి కలుపుతూ పంచదార, అజినమోటో, మిరియాలపొడి, రెండు స్పూన్ల కార్న ఫ్లోర్ (నీళ్లల్లో కలిపినది), సోయాసాస్, చిటికెడు ఉప్పు వేసి అయిదారు నిమిషాలు స్టౌ మీద వుంచి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చెయ్యాలి. ఇది టొమాటో సాస్‌తో తింటే బావుంటుంది.

పునుగులు


కావలసిన పదార్థాలు: మినపప్పు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, సోడా - చిటికెడు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మినపప్పుని ముందురోజు నానబెట్టుకుని మర్నాడు పొద్దుటే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ గంట తర్వాత పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక పునుగుల్లా వేసుకోవాలి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ పునుగులను పల్లీ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి.

Friday, September 11, 2015

మేతి టమోటో రైస్ బాత్


కావల్సిన పదార్థాలు:
టమోటోలు: 3 (chopped) మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped) అన్నం: 3 cups (cooked) ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup వెల్లుల్లి పేస్ట్: 2tsp పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit) పసుపు: 1tsp కారం: 1tsp జీలకర్ర: 1tsp ధనియాలపొడి: 1tsp ఉప్పు: రుచికి సరిపడా జీలకర్ర: 1tsp ఆవాలు: 1tsp కరివేపాకు : రెండు రెమ్మలు నూనె: 2tbsp

తయారుచేయు విధానం:

ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు అందులో టమోటోలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు అందులో మెంతిఆకు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకు మెత్తగా ఉడికే వరకూ ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి నిధానంగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం కలగలిసేలా ఉండి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.

అంతే హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, మేతి, టమోటో రైస్ బాత్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు.

సజ్జప్పాలు


• కావాల్సినవి: కొబ్బరి - సగం చెక్క, బెల్లం తురుము - కప్పు, బొంబాయిరవ్వ - కప్పు, మైదా - కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా, ఉప్పు - చిటికెడు, యాలకులపొడి - కొద్దిగా, ఉప్పు - చిటికెడు.

• తయారీ: మైదాలో చిటికెడు ఉప్పు వేసి నీళ్లతో పూరీపిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె లేకుండా బొంబాయిరవ్వను దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో బెల్లం తురుము, అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. బెల్లం తురుము కరిగాక, కొబ్బరితురుము, యాలకులపొడి వేయాలి. నిమిషం తరవాత వేయించిన బొంబాయిరవ్వను కూడా వేసి కలపాలి. కాసేపటికి ఇది హల్వాలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారాక చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదాను కొద్దిగా తీసుకుని చిన్న పూరీలా వత్తాలి. అందులో కొబ్బరి ఉండను ఉంచి, అంచులు మూసేయాలి. తరవాత జాగ్రత్తగా పూరీలా వచ్చేలా వత్తుకోవాలి. దీన్ని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుంటే సజ్జప్పాలు సిద్ధం.

పెసరపప్పు హల్వా

• కావల్సినవి: పెసరపప్పు - కప్పు, నెయ్యి - కప్పు, పాలు - కప్పు, చక్కెర - కప్పు, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ - కొన్ని, యాలకులపొడి - అరచెంచా.

• తయారీ: ముందుగా బాణలిలో చెంచా నెయ్యి కరిగించి జీడిపప్పు, కిస్‌మిస్ పలుకుల్ని వేయించుకుని పెట్టుకోవాలి. పెసరపప్పును గంట ముందుగా నానబెట్టుకోవాలి. తరవాత నీటిని వంపేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో మిగిలిన నెయ్యిని కరిగించాలి. అందులో పెసరపప్పు ముద్ద వేసి మంట తగ్గించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి పెసరపప్పు ముద్దలో పచ్చివాసన పోయి అది వేగినట్లు అవుతుంది. అప్పుడు చక్కెర వేయాలి. రెండు నిమిషాల తరవాత పాలు కూడా పోసి.. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. కాసేపటికి ఇది హల్వాలా తయారై గట్టిపడుతుంది. అప్పుడు యాలకులపొడి, వేయించిపెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి దింపేయాలి. అంతే.. హల్వా సిద్ధం. కావాలనుకుంటే దీన్ని నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకుని ఆరిపోయాక బిళ్లల్లా కోసుకోవచ్చు.

తోటకూర గారెలు

• కావాల్సినవి: పొట్టు మినప్పప్పు - గ్లాసు, జీలకర్ర - చెంచా, అల్లం, పచ్చిమిర్చి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, మిరియాలు - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, తోటకూర తరుగు - అరకప్పు.

• తయారీ: మినప్పప్పును మూడుగంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లన్నీ వంపేసి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి మెత్తగా అయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, మిరియాలు, తోటకూర తరుగు వేసి మరోసారి మిక్సీ పట్టి, తగినంత ఉప్పు కలపాలి. తరవాత ఈ పిండి గారెల్లా తట్టుకుని, కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

వంకాయ మంచూరియా

వంకాయ మంచూరియా
కావలసిన పదార్థాలు:
వంకాయలు - 4, వెల్లుల్లి తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కొత్తిమీర తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లికాడల తరగు - 1 కప్పు, సోయా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, టమోటా సాస్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, పంచదార - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, జారు కోసం: కార్న్‌ఫ్లోర్‌, మైదా -8 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఉప్పు - చిటికెడు.
తయారుచేసే విధానం: మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పుని కొద్ది నీటితో జారుగా కలుపుకోవాలి. వంకాయలను పొడుగ్గా ‘ఫింగర్స్‌’ లా కట్‌ చేసుకుని జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. ఇప్పుడు నూనెలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేగించాలి. మంట తగ్గించి సోయా, టమోటా సాస్‌లు, పంచదార, ఉప్పు వేసి 2 నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల తర్వాత దించేసి, ఉల్లికాడలతో అలంకరించాలి.

Wednesday, September 9, 2015

బటాణీ కూర

చపాతి, పూరీల్లోకి ఉపయోగపడే బటాణీ కూర తయారుచేసే విధానం.

కావలసిన పదార్దాలు :ఎండు బటాణీలు – పావుకిలో,

పసుపు – అరటీస్పూన్

జీలకర్ర – అరటీస్పూన్

మిరియాలు – ముప్పావు టీస్పూన్

పచ్చిమిర్చి – నాలుగు

అల్లం ముద్ద – టీస్పూన్, పుదీనా – కట్ట, కొత్తిమీర – కట్ట,

చాట్ మసాల – అర టీస్పూన్, నెయ్యి – పావు కప్పు

ఉప్పు – తగినంత

తయారి విధానం : బటానీలను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి బటానీలను ఉడికించాలి. ఉడికిన తరువాత నీళ్ళు వంపేయాలి. జీలకర్ర, చాట్ మసాల, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముద్ద, అల్లం, పుదీనా, కొత్తిమీర తురుముల్ని ఉడికించిన బటాణీలలో వేసి బాగా దగ్గరగా వచ్చేఅంతవరకు కలపాలి. చివరగా నెయ్యి, కొంచెం ఉప్పు వేసి దించేయాలి. చపాతి, పూరీల్లోకి ఈ కూర బాగు౦టుంది.

మైదాపిండి బిస్కెట్స్


మైదాపిండి బిస్కెట్స్ తినటానికి చాల రుచిగా వుంటాయి. ఇవి తయారుచేసుకోవడం చాలా సులువు. సాయంత్రం వేళ వేడి వేడి టీ లేదా కాఫితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన ధినుసులు:
మైదాపిండి – 500 గ్రాములు
వాము – ఒక స్పూన్
ఉప్పు – ఒక స్పూన్
కారం – రెండు స్పూన్స్
వెన్న – నాలుగు స్పూన్స్
నూనె – 500 గ్రాములు
నీళ్ళు - తగినన్ని
తయారుచేయువిధానము:
ఒక పళ్ళెం లో మైదాపిండి వేసుకోవాలి. అందులో వాము, ఉప్పు, కారం, మరియు వెన్నను కూడా వేడి చేసి పిండిలో కలిపి, నీళ్ళు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. రొట్టిల పీట మీద చపాతిలా చేసి, కత్తితో నిలువుగా అంటే ఒక చపాతీని నాలుగు లేదా ఐదు వరసులుగా వచ్చేటట్లు కోసి తరవాత అడ్డంగా బిస్కెట్స్ సైజులో చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇలా చపాతీలన్నింటిని కోసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగ కాగిన తరవాత ప్రక్కన పెట్టుకున్న బిస్కెట్స్ను కొంచె కొంచెంగా వేసి, వేయించుకోవాలి. అంతే!ఎంతో రుచిగా వుండే మైదాపిండి బిస్కెట్స్ రెడీ!

Tuesday, September 1, 2015

కాబూలీ పలావ్

కావల్సినవి: బియ్యం - కప్పు (ఇరవైనిమిషాల ముందు నానబెట్టుకోవాలి), కాబూలీ సెనగలు - పావుకప్పు (ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర చెంచా, యాలకులు - నాలుగు, దాల్చిన చెక్క - చిన్నముక్క, లవంగాలు - మూడు, అనాసపువ్వు - రెండు, బిర్యానీఆకులు - రెండు, సాజీరా - చెంచా, జాపత్రి - ఒకటి, పచ్చిమిర్చి - ఐదారు (నిలువుగా తరగాలి), నెయ్యి - పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి పెద్దది (ముక్కల్లా కోయాలి), కొత్తిమీర - కట్ట, పుదీనా ఆకులు - అరకప్పు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారీ: పెద్ద బాణలి లేదా అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యీ, నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. నెయ్యి కరిగాక యాలకులూ, దాల్చినచెక్కా, లవంగాలూ, అనాసపువ్వూ, బిర్యానీ ఆకులూ, సాజీరా, జాపత్రి వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాల తరవాత పుదీనా ఆకులూ, అల్లంవెల్లుల్లి పేస్టూ, పచ్చిమిర్చీ, ఉల్లిపాయముక్కలూ, నానబెట్టిన సెనగలూ వేయాలి. రెండు నిమిషాల తరవాత బియ్యం, తగినంత ఉప్పు, ఒకటిన్నర కప్పునీళ్లూ పోసి మూత పెట్టేయాలి. నీళ్లన్నీ పోయి అన్నం ఉడికాక తీసేస్తే కాబూలీ పలావ్ సిద్ధం. దీన్ని ఉల్లిపాయ పెరుగు పచ్చడితో కలిపి వడ్డించాలి.