Tuesday, October 6, 2015

సేమ్యా ఉప్మా... రుచిగా రావాలంటే?

• ఎప్పుడూ ఇడ్లీ, దోశ అని కాకుండా ఇంట్లో సేమ్యా ఉప్మా కూడా ప్రయత్నిస్తుంటా. కానీ నేనెలా చేసినా ఇంట్లో వాళ్లకి నచ్చడం లేదు. సేమ్యాను నూనెలో వేయించి పక్కన పెట్టుకుని తరవాత తాలింపు వేసి.. నీళ్లు పోసి మరిగిస్తా. అందులో సేమ్యా వేసి కాసేపయ్యాక మిగిలిన నీటిని వంపేస్తా.. ఐదునిమిషాలు సేమ్యాను మగ్గనిచ్చి చివరగా కొత్తిమీర చల్లి దింపేస్తున్నా. ఇందులో రకరకాల కాయగూరలు వేసినా బాగా లేదని చెబుతున్నారు. దీనికేదయినా పరిష్కారం ఉందా?
-హెచ్.ఎం లక్ష్మి, చిత్తూరు

* మీరు తెల్లగా ఉండే సేమ్యాను వాడుతున్నట్లున్నారు. ఈసారి వేయించిన సేమ్యా అని బజార్లో దొరుకుతుంది. కాస్త ఎర్రగా ఉండే దాన్ని తెచ్చుకోండి. తాలింపు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిర్చి ముక్కలూ వేశాక కప్పు సేమ్యాకు రెండు కప్పుల నీళ్లు పోయండి. అవి మరిగాక సేమ్యా వేసి కలిపి మూత పెట్టేయండి. సేమ్యా యాభైశాతం ఉడికిందనుకున్నాక మంట బాగా తగ్గించండి. మధ్యలో సేమ్యాను గరిటెతో కలపకూడదు. అప్పుడే మిగిలిన నీటిని సేమ్యా పీల్చుకుని చక్కగా ఉడుకుతుంది. నూనె కూడా కొద్దిగా ఎక్కువగా వేస్తేనే సేమ్యా పొడిపొడిగా వస్తుంది. నూనె బదులు నెయ్యి వాడితే ఇంకా రుచిగా ఉంటుంది.
సేమ్యాను మరో పద్ధతిలోనూ చేసుకోవచ్చు. సేమ్యాకు సరిపడా నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టి అందులో అరచెంచా ఉప్పూ, చెంచా నూనె వేయాలి. నీళ్లు మరిగాక సేమ్యా వేయాలి. యాభై శాతం ఉడికాక వెంటనే దింపేసి చన్నీళ్లలో వేయాలి. రెండు నిమిషాల తరవాత ఆ నీటిని వంపేసి నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో తాలింపు వేయించుకుని, కావల్సిన కూరగాయముక్కలు వేయాలి. అవి వేగాక ఉడికించి పెట్టుకున్న సేమ్యా, సరిపడా ఉప్పూ వేసి మంట తగ్గించేయాలి. ఇది సన్నని మంటపై మగ్గి.. పొడిపొడిగా వస్తుంది.
ఇలా ఉడికించిన సేమ్యాతో హరియాలీ ఉప్మా కూడా చేసుకోవచ్చు. సేమ్యా మోతాదుని బట్టి కొత్తిమీరా, పుదీనా, చిన్న అల్లంముక్కా, పచ్చిమిర్చీ కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో మూడు చెంచాల నూనె వేడిచేసి, ఈ కొత్తిమీర మసాలా, తగినంత ఉప్పూ వేసి వేయించాలి. పచ్చివాసన పోయాక ఉడికించిన సేమ్యా వేసి బాగా కలిపితే సరి. సాధారణ సేమ్యాను ఉడికిస్తున్నప్పుడు ఎక్కువగా కలిపితే ముక్కల్లా విరిగిపోతాయి. అందుకే కొంత ఉడికాక, మూత పెట్టేసి మంట తగ్గించి మగ్గనివ్వాలి.

0 comments:

Post a Comment