Sunday, October 4, 2015

క్యాబేజీ కూర

కావలసిన పదార్థాలు:
============

క్యాబేజీ గడ్డ ఒకటి
పెసరపప్పు (1 కిలో క్యాబేజీకి 100 గ్రాములు)
తురిమిన లేత కొబ్బరి
కరివేపాకు
పచ్చిమిరపకాయలు
కొత్తిమీర
కావలసినంత ఉప్పు, పసుపు, వంట నూనె

తయారు చేసే విధానం:
===============

ముందుగా క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత రుచి, అంత తొందరగా ఉడుకుతుంది. తరిగిన క్యాబీజిని కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి నీళ్లు పోయాలి. నీళ్ల పరిమాణం క్యాబేజీ మెత్తబడేంత వరకే. అంటే ముక్కలు తేలేలా పోయకూడదు. క్యాబేజీలో నీరు ఉంటుంది కాబట్టి ఎక్కువ పోయక్కర్లేదు. కాస్త ఉప్పు, పసుపు వేసి కుక్కర్ మూత, విజిల్ పెట్టి పొయ్యిపై పెట్టాలి. ఒక రెండు విజిల్స్ వచ్చిన తరువాత కుక్కరును దించి ఒక చన్నీటి పాత్రలో ఉంచాలి. కాస్త చల్లారాక విజిల్ తీయాలి. మొత్తం ఆవిరి దానంతట అదే పోయేంతవరకు ఉంచితే ముక్కలు, పెసరపప్పు మరీ మెత్తబడిబోతాయి. ఒకవేళ ఉడికిన క్యాబేజీలో నీరు మిగిలితే ఒక పాత్రలోకి వడకట్టుకొని చారు/సాంబారు లోకి లేదా సూప్ లాగా కూడా తాగ వచ్చు. అందుకే నీళ్లు ఎక్కువ మిగలకుండా కుక్కర్లో ఉడికించటం ఈ కూరకు కీలకం.

పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. బాణలిలో కాస్త నూనే వేసి వేడి చేయాలి. క్యాబేజీ ముందే ఉడికింది కాబట్టి చాల తక్కువ నూనె పడుతుంది. నూనెలో శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. కాస్త రంగు మారుతున్నప్పుడు ఆవాలు జీలకర్ర వేయాలి. ఇవి చిటపటలాడగానే తరిగిన పచ్చిమిరప, కరివేపాకు వేసి, ఒక అర నిమిషం తరువాత క్యాబేజీని కుమ్మరించాలి. కుక్కర్లో మొదట వేసిన ఉప్పును బట్టి మరల కావలసివస్తే ఉప్పు వేసుకోవచ్చు. తురిమిన లేత కొబ్బరిని వేసి ఎక్కువ వేడిపై ఒక 7-8 నిమిషాలు మూత పెట్టకుండా తీపుతూ ఉండాలి. కొబ్బరి పెసరపప్పు కన్నా ఎక్కువ ఉండకూడదు. క్యాబేజీలో నీరంతా ఇంకిపోయిన తరువాత తరిగిన కొత్తిమీర అలంకరించి హాట్ప్యాక్‌లోకి మార్చుకొని మూత పెట్టాలి.

నూనె తక్కువ కాబట్టి కొవ్వు తక్కువ, పెసరపప్పుతో మాంసకృత్తులు, కొబ్బరితో మంచి కొవ్వు, క్యాబేజీ ఔషధ గుణాలు కలిగిన ఈ కూర పరిపూర్ణమైన ఆహారం. దీనిని పుల్కాలు/చపతీలు/అన్నంతో తినవచ్చు. మొత్తం 15 నిమిషాల్లో కూర సిద్ధం చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment