Tuesday, October 27, 2015

గుమ్మడికాయ హల్వా

తురిమిన గుమ్మడికాయ - 500 gms
చక్కర - 200 gms
నెయ్యి - 50 gms
కోవా - 50 gms
యాలకుల పొడి - 1 tsp
ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా - 1/4 కప్పు
పిస్తా రంగు.. చిటికెడు

ముందుగా గుమ్మడికాయ కడిగి చెక్కు తీసి, సన్నగా తురిమి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఈ తురుము తడి ఆరిపోయేదాకా వేయించాలి. ఇపుడు చక్కర వేసి మళ్ళీ ఉడికించాలి. కాస్త చిక్కబడ్డాక కోవా, పిస్తా రంగు, యాలకుల పొడి వేసి బాగా కలిపి నెయ్యి బయటకు వచ్చేదాకా వేయించాలి. ఇపుడు సన్నగా తరిగిన ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా వేసి దింపేయాలి.

• మెంతి ముటియా


కావల్సినవి: రాగిపిండి, గోధుమపిండి - కప్పు చొప్పున, సెనగపిండి - రెండుటేబుల్‌స్పూన్లు, మెంతికూర తరుగు - ఒకటిన్నరకప్పు, వెల్లుల్లి పేస్టు - నాలుగు చెంచాలు, అల్లంపచ్చిమిర్చి పేస్టు - నాలుగు చెంచాలు, పసుపు - కొద్దిగా, వెన్నలేని పెరుగు - అరకప్పు, ఉప్పు - తగినంత, వంటసోడా - చిటికెడు, పాలకూర తరుగు - అరకప్పు, నూనె - నాలుగు చెంచాలు, ఆవాలు - చెంచా, నువ్వులు - రెండు చెంచాలు.

తయారీ: ఓ గిన్నెలో రాగిపిండీ, గోధుమపిండీ, సెనగపిండీ తీసుకుని అన్నింటినీ కలపాలి. తరవాత అందులో మెంతికూర తరుగూ, పాలకూర తరుగూ, వెల్లుల్లి పేస్టూ, అల్లంపచ్చిమిర్చి పేస్టూ, పసుపూ, పెరుగూ, ఉప్పూ, వంటసోడా వేసి అన్నింటినీ బాగా కలపాలి. తరవాత నీళ్లు చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చేతులకు కాస్త నూనె రాసుకుని ఈ పిండిని కొద్దిగా తీసుకుని బులెట్‌లా చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పదిహేను నిమిషాలు ఆవిరిమీద ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలూ, నువ్వులూ వేయించుకోవాలి. అవి వేగాక ఈ ముటియాలను అందులో వేయాలి. కాసేపటికి అవి ఎర్రగా వేగుతాయి. అప్పుడు తీసేయాలి. కావాలనుకుంటే వీటిని బ్రెడ్‌పొడిలో ముంచి కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవచ్చు.

• మెంతి పాటోళి

కావల్సినవి: సెనగపప్పు - అరకప్పు, మెంతికూర - మూడుకట్టలు, ఆవాలు - చెంచా, జీలకర్ర - అరచెంచా, మినప్పప్పు - చెంచా, ఎండుమిర్చి - రెండు, పసుపు - పావుచెంచా, నూనె - పావుకప్పు, ఉప్పు - తగినంత.

తయారీ: సెనగపప్పును రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, మినప్పప్పూ వేయించాలి. అవి వేగాక ఎండుమిర్చీ, జీలకర్ర వేయాలి. రెండు నిమిషాల తరవాత మెంతికూర తరుగు వేసి బాగా కలపాలి. ఆకులు వేగాయనుకున్నాక సెనగపప్పు ముద్దా, తగినంత ఉప్పూ, పసుపూ వేయాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి ఇది పొడికూరలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి.

• మెంతి చట్నీ

కావల్సినవి: మెంతికూర - కప్పు, మినప్పప్పు, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా చొప్పున, కొబ్బరితురుము - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ తరుగు - కొద్దిగా, చింతపండు - కొద్దిగా, ఎండుమిర్చి - ఐదు, కొత్తిమీర - కట్ట, జీలకర్ర - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - నాలుగు చెంచాలు.
తయారీ: బాణలిలో ఒకటిన్నర చెంచా నూనె వేడిచేసి మినప్పప్పూ, సెనగపప్పూ వేయాలి. అవి వేగాక కొత్తిమీరా, జీలకర్రా, ఎండుమిర్చీ వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కొద్దిగా వేగాయనుకున్నాక మెంతిఆకులు వేసేయాలి. మెంతిఆకుల్లో పచ్చివాసన పోయాక కొబ్బరితురుము వేసి పొయ్యి కట్టేయాలి. మెంతి ఆకులూ, తాలింపూ, చింతపండూ, తగినంత ఉప్పూ మిక్సీలో తీసుకుని నీళ్లు చల్లుకుంటూ పచ్చడిలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనిపై కొన్నివేయించిన వెల్లుల్లి రెబ్బలు వేస్తే సరి.

Thursday, October 22, 2015

మేతీ మసాలా వడ

కావలసినవి: పచ్చిశెనగపప్పు- ఒక కప్పు, మెంతికూర, ఉల్లిపాయ (తరుగు)- ఒక్కో కప్పు చొప్పున, పచ్చిమిర్చి (తరుగు)- రెండు, అల్లం(తరిగి)- ఒక టీస్పూను, జీలకర్ర- అరటీస్పూను, ఉప్పు- తగినంత, నూనె- డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ: పచ్చిశెనగపప్పుని రెండు గంటలపాటు నానబెట్టి పిండిలా చేయాలి. ఈ పిండిలో మెంతికూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు, ఒక టీస్పూను నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని గారెల్లా వత్తి నూనెలో డీప్‌ఫ్రై చేయాలి. కరకరలాడాలంటే పిండిలో చిటికెడు వంటసోడా వేయాలి.


రవ్వ పులిహోర

కావలసినవి: బియ్యం రవ్వ- ఒక కప్పు, నీళ్లు- రెండు కప్పులు, చింతపండు- వందగ్రాములు, పచ్చిమిర్చి- మూడు, ఎండుమిర్చి- మూడు, ఆవాలు- ఒక టీస్పూను, శెనగపప్పు, మినపప్పు- ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, పల్లీలు- రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు- అరటీస్పూను, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె- నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత. 

తయారీ: చింతపండులో కొన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. స్టవ్‌పై గిన్నె పెట్టి ఒక టీస్పూను నూనె వేడి చేసి బియ్యం రవ్వను తక్కువ మంటపై వేగించాలి. తరువాత దీన్ని ఒక పెద్ద పళ్లెంలో పోసి చల్లార్చాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేగించాలి. కొద్దిసేపటి తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేగించాలి. ఇందులో చింతపండు పులుసు, పసుపు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఆ తరువాత స్టవ్‌ ఆపేసి రవ్వ, ఉప్పు వేసి బాగా కలపాలి.

ఫ్రూట్‌ కేసరి

కావలసినవి: బొంబాయి రవ్వ- ఒక కప్పు, నీళ్లు- రెండు కప్పులు, పంచదార- ఒకటిన్నర కప్పు, పైనాపిల్‌, యాపిల్‌, జామకాయ ముక్కలు - ఒక్కోటి పావుకప్పు చొప్పున, నెయ్యి- అరకప్పు, కిస్‌మిస్‌, జీడిపప్పు- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున 

తయారీ: పండ్లముక్కల్లో మూడు టేబుల్‌ స్పూన్ల చక్కెర వేసి కలపాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసి జీడిపప్పు, యాలకలను వేగించుకోవాలి. ఆ తరువాత రవ్వ వేసి రెండు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో లేదా మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యివేసి పండ్ల ముక్కల్ని మూడు నిమిషాలపాటు వేగించాక అరకప్పు నీళ్లు పోసి మరిగించాలి. తరువాత రవ్వ, చక్కెర వేసి తక్కువ మంటపై ఉడికించాలి. రవ్వ గడ్డలు కట్టకుండా తిప్పుతుండాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక స్టవ్‌ ఆపేసి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాలి.

Tuesday, October 20, 2015

నువ్వుల అన్నం

కావల్సినవి: పొడిగా వండిన అన్నం - కప్పు, నువ్వులు - అరకప్పు, కారం - చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - టేబుల్‌స్పూను, తాలింపు గింజలు - చెంచా, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు రెబ్బలు - రెండు.

తయారీ: ముందుగా నువ్వుల్ని నూనె లేకుండా వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడీ, కారం, తగినంత ఉప్పూ అన్నంపై వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి తాలింపు గింజలూ, కరివేపాకు రెబ్బలూ, ఎండుమిర్చీ వేయించుకుని అన్నంలో వేసి బాగా కలిపితే సరి. నోరూరించే నువ్వుల సద్ది సిద్ధం.

బియ్యం సత్తుపిండి

కావల్సినవి: బియ్యం - అరకప్పు, యాలకులు - రెండు, కరిగించిన నెయ్యి - టేబుల్‌స్పూను, చక్కెర - అరకప్పు కన్నా కొద్దిగా తక్కువగా.

తయారీ: ముందుగా బియ్యాన్ని నూనె లేకుండా బాణలిలో వేయించుకోవాలి. వేడి చల్లారాక బియ్యంలో చక్కెరా, యాలకులూ వేసుకుని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సత్తుపిండిని ఓ గిన్నెలోకి తీసుకుని కరిగించిన నెయ్యి వేసి కలపాలి. ఇది ముద్దలా కాకుండా పొడిపొడిగానే ఉండేలా చూసుకోవాలి.

పెసర సద్ది

కావల్సినవి: అన్నం - కప్పు, పెసరపప్పు - రెండున్నర టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - మూడు, తాలింపు గింజలు - చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బలు - రెండు, కారం - కొద్దిగా.

తయారీ: బాణలిలో పెసరపప్పును నూనె లేకుండా వేయించుకోవాలి. దోరగా వేగాక దింపేసి చల్లారనివ్వాలి. తరవాత మిక్సీలో తీసుకుని పొడిలా చేసుకోవాలి. అన్నంలో ఈ పెసరపొడీ, కారం, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి ఎండుమిర్చీ, తాలింపుగింజలూ, కరివేపాకు రెబ్బలూ వేయించుకోవాలి. అన్నీ వేగాక అన్నంపై వేసి కలిపితే సరి.

బెల్లం అన్నం

కావల్సినవి: బియ్యం - అరకప్పు, పెసరపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, బెల్లం తరుగు - ముప్పావుకప్పు, యాలకులు - రెండు.

తయారీ: బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లోకి తీసుకుని కప్పున్నర నీళ్లు పోసి, మూడునాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరవాత అందులో బెల్లం తరుగు వేసి పొయ్యిమీద పెట్టాలి. కాసేపటికి బెల్లం కరుగుతుంది. అప్పుడు మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. బెల్లం అన్నం సిద్ధమవుతుంది. చివరగా యాలకులు వేస్తే చాలు.

మలీద ముద్దలు

కావల్సినవి: అప్పుడే చేసిన మెత్తని సజ్జ లేదా జొన్నరొట్టెలు - నాలుగు, బెల్లం తరుగు - ఒకటిన్నర కప్పు, కరిగించిన నెయ్యి - కప్పు.

తయారీ: సజ్జ లేదా జొన్నరొట్టెలు వేడిగా ఉన్నప్పుడే ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బెల్లం తరుగూ, కరిగించిన నెయ్యీ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఆ వేడికి బెల్లం కరిగి, రొట్టెలు ముద్దలా అవుతాయి. అప్పుడు ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది

గుమ్మడి హల్వా

కావల్సినవి: కావల్సినవి: తీపి గుమ్మడికాయ - కేజీ, వేడిపాలు - రెండు కప్పులు, చిక్కని పాలు - అరలీటరు, యాలకులపొడి - చెంచా, పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు - అన్నీ కలిపి టేబుల్‌స్పూను, నెయ్యి - అరకప్పు, చక్కెర - ఒకటిన్నర కప్పు.

తయారీ: గుమ్మడికాయ చెక్కునీ, గింజల్నీ తీసేయాలి. తరవాత తురుముకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి గుమ్మడి తురుమును దోరగా వేయించుకోవాలి. తురుములో పచ్చివాసన పోయి కొద్దిగా వేగాక వేడిపాలు పోయాలి. పాలల్లో గుమ్మడి తురుము ఉడికి కాసేపటికి దగ్గర పడుతుంది. అప్పుడు చిక్కని పాలూ, యాలకులపొడీ, చక్కెరా వేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే హల్వా దగ్గరకు అవుతుంది. అప్పుడు బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసి కలిపి దింపేయాలి.

గోధుమలడ్డు

కావల్సినవి: గోధుమపిండి - కప్పు, చక్కెరపొడి - అరకప్పు, బెల్లం తరుగు - పావుకప్పు, యాలకులపొడి - అరచెంచా, జీడిపప్పు పొడి - పావుకప్పు, నెయ్యి - అరకప్పు.

తయారీ: బెల్లం తరుగు మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద ఉంచాలి. బెల్లం కరిగాక దింపేయాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యివేడిచేసి గోధుమపిండి వేయించాలి. దాన్లో పచ్చివాసన పోయి గోధుమపిండి కొద్దిగా రంగు మారాక యాలకులపొడీ, జీడిపప్పు పొడీ వేసి దింపేయాలి. ఇందులో బెల్లం కరిగించిన నీరూ, చక్కెరపొడీ వేసి బాగా కలపాలి. వేడిగా ఉన్నప్పుడే చిన్నచిన్న ఉండల్లా చుట్టుకుంటే సరిపోతుంది.

Monday, October 19, 2015

జొన్నరొట్టెతో ఎముక పుష్టి..

జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బియ్యం, గోధుమలతో పోలిస్తే.. జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. 


ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు కూడా వీటిలో ఎక్కువ.

గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది.

ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి.

శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్నగింజల్లో ఉంది.

ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది.

నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది.

వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి.

జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తిని పెంపొంది అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ది చేస్తాయి.

Sunday, October 18, 2015

మసాలా పూరీలు

• కావలసినవి 
మైదాపిండి: 2 కప్పులు, సెనగపిండి: ఒకటిన్నర కప్పులు, కరివేపాకు: 2 రెబ్బలు, మెంతికూర తరుగు: 2 టీస్పూన్లు, పసుపు: పావుటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, షాజీరా: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

• తయారుచేసే విధానం

* ఓ గిన్నెలో జల్లించిన మైదాపిండి, సెనగపిండి తీసుకుని అందులో పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా, షాజీరా, సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి, తగినంత ఉప్పు కూడా వేసి చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. అరగంట తరవాత మృదువుగా పిసికి చిన్న ఉండలుగా చేసుకోవాలి.

* ఒక్కో ముద్ద తీసుకుని పలుచగా పూరీలా వత్తి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. ఈ పూరీలు నాలుగైదు రోజుల వరకూ నిల్వ ఉంటాయి.

బగారన్నం


• కావలసినవి
బాస్మతిబియ్యం: పావుకిలో, ఉల్లిపాయలు: రెండు, పుదీనా ఆకులు: గుప్పెడు, పచ్చిమిర్చి: ఎనిమిది, బిర్యానీ ఆకులు: ఆరు, పసుపు: అర టీస్పూను, నూనె: 4 టీస్పూన్లు, నెయ్యి: 4 టీస్పూన్లు, లవంగాలు: పది, యాలకులు: 7, దాల్చినచెక్క: అంగుళంముక్కలు రెండు, షాజీరా: 2 టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత

• తయారుచేసే విధానం

* బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టుకోవాలి.

* మందపాటి గిన్నెలో నూనె వేసి కాగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు వేసి మెత్తబడే వరకూ వేయించాలి. తరవాత లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చినచెక్క, బిర్యానీఆకు, అల్లంవెల్లుల్లిముద్ద, పసుపు వేసి వేయించాలి. ఒకటికి ఒకటిన్నర కొలత చొప్పున తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. తరవాత నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయాక మంట పూర్తిగా తగ్గించి మూతపెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి దించాలి.

• అర్బీ ఫ్రై

కావలసినవి: 
చేమదుంపలు- అరకేజీ 
అల్లం పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు 
పచ్చిమిర్చి(పేస్టు)- మూడు
మామిడికాయ పొడి- చిటికెడు
రాతి ఉప్పు, కారం- తగినంత
వాము- పావు టీస్పూను
ధనియాల పొడి- పావు టీస్పూను

తయారీ:
చేమ దుపంల్ని ఉడికించి పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆ ముక్కలు గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. వేరొక పాన్‌లో ఒక టేబుల్‌స్పూను నూనె వేసి అల్లం, పచ్చిమిర్చి పేస్టుని రెండు నిమిషాలు వేగించి చేమదుంపల ముక్కల్లో వేసి కలపాలి. తరువాత ఉప్పు, ధనియాలపొడి, మామిడికాయ పొడి, వాము వేసి కలపాలి. కొద్దిసేపటి తరువాత స్టవ్‌ ఆపేసి కొత్తమీర చల్లి సర్వ్‌ చేయాలి.

• సాబూదాన్‌ పూరీ

కావలసినవి: 
సగ్గుబియ్యం- పావు కేసీ 
బంగాళా దుంపలు- ఐదు 
పచ్చిమిర్చి(తరిగి)- రెండు
కారం- పావు టీస్పూను
నూనె- డీప్‌ఫ్రైకి సరిపడినంత, ఉప్పు- తగినంత

తయారీ:
సగ్గుబియాన్ని గంటసేపు నానబెట్టాలి. బంగాళాదుంపల్ని ఉండకబెట్టి పొట్టు తీసి మెత్తగా చేయాలి. దీనిలో సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. చేతులకి కొద్దిగా నూనె రాసుకొని పిండిని ఉండలుగా చేసి కొద్దిగా వత్తాలి. అవి ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు నూనెలో డీప్‌ఫ్రై చేయాలి. సగ్గుబియ్యం పూరీ రెడీ...

• ఖస్‌ఖస్‌ ఆలూ

కావలసినవి: 
పచ్చిమిర్చి- మూడు 
బంగాళా దుంపలు ( తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరిగి)- ఆరు 
పసుపు- అరటీస్పూను
కొత్తిమీర తరుగు- పావు కప్పు
ఎండు మిర్చి- మూడు
గసగసాలు- రెండు టేబుల్‌స్పూన్లు
నూనె- మూడు టేబుల్‌స్పూన్లు
నీళ్లు- అరకప్పు, ఉప్పు- తగినంత

తయారీ:
గసగసాలని రెండు నిమిషాలపాటు వేగించుకొని పచ్చిమిర్చి, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె పోసి వేడైన తరువాత బంగాళా దుంపల ముక్కలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో లేదా వేరొక పాన్‌లో నూనె వేడి చేసి ఎండు మిర్చి, పసుపు వేసి కొద్దిగా వేగించాలి. దానిలో గసగసాల పేస్టు వేసి తక్కువ మంటపై నూనె పైకి తేలే వరకు లేదా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తరువాత బంగాళా దుంపలు, ఉప్పు వేసి పావుగంట పాటు కలుపుతూ ఉండాలి. బంగాళా దుంపలు ఉడికిన తరువాత స్టవ్‌ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా పూరీల్లో తింటే చాలా టేసీగా ఉంటుంది.

• ఆలూ పూరీ

కావలసినవి: 
గోధుమ పిండి- రెండు కప్పులు 
బంగాళా దుంపలు- నాలుగు 
ఉప్పు- అరటీస్పూను
మిరియాల పొడి- అర టీస్పూను
నెయ్యి- డీప్‌ఫ్రైకి సరిపడినంత

తయారీ:
బంగాళా దుంపల్ని ఉడికించి మెత్తగా చేసుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, మిరియాలపొడి, బంగాళా దుంపల ముద్ద వేసి పూరి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీల్లా వత్తుకోవాలి. వీటిని రెండు వైపులా గోధుమరంగు వచ్చే వరకు నెయ్యిలో వేగించుకోవాలి. అంతే... కుట్టీ కీ పూరీ రెడీ..వీటిని ఆలూ కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

* అల్లం గారెలు


• కావలసినవి
మినప్పప్పు: 2 కప్పులు, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: 2 టీస్పూన్లు, మిరియాలు: అర టీస్పూను, ఎండుకొబ్బరి తురుము: టీస్పూను, ఉప్పు: 2 టీస్పూన్లు, దాల్చినచెక్క: పావు అంగుళంముక్క, లవంగాలు: రెండు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

• తయారుచేసే విధానం

మినప్పప్పుని ముందుగానే నానబెట్టాలి. ముందుగా నానబెట్టిన మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బాలి. తరవాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బుకోవాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెలు చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో వడ్డించండి.

Saturday, October 17, 2015

• మొక్కజొన్న పనీర్‌ పకోడీ

కావలసినవి: మొక్కజొన్నలు- పావుకేజీ, పనీర్‌- వందగ్రాములు, ఉల్లిపాయ- ఒకటి, మామిడికాయ పొడి- ఒకటిన్నర టీస్పూను, పాలు- ఒక కప్పు, పచ్చిమిర్చి (తరిగి)- రెండు, అల్లం(తరిగి)- రెండు టీస్పూన్లు, వెల్లుల్లి(తరిగి)- రెండు టీస్పూన్లు, శనగపిండి- ఆరు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు- రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర పొడి- అరటీస్పూను, నూనె డీప్‌ఫ్రైకి సరిపడినంత. 

తయారీ: మొక్కజొన్నల్ని గ్రైండ్‌ చేసుకోవాలి. అలాగే పనీర్‌ని తురుముకొని పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి అల్లం వెల్లుల్లిని వేగించి దానిలో మొక్కజొన్న పిండి, ఉప్పు వేసి కలపాలి. కొద్దిసేపటి తరువాత పాలు పోయాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత వేరొక గిన్నెలో వేసి చల్లబరచాలి. దీనిలో పనీర్‌, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, మామిడికాయపొడి, ఉప్పు, శనగపిండి, కొద్దిగా పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమంతో చిన్నచిన్న ఉండలు చేసి నూనెలో డీప్‌ఫ్రై చేయాలి. వీటిని వేడి వేడిగా టొమాటోసా‌సతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
జొన్న రొట్టెలు

• కావలసిన పదార్థాలు :
జొన్న పిండి... రెండు కప్పులు
నీరు... తగినంత
ఉప్పు... సరిపడా

• తయారీ విధానం :
జొన్నపిండిని గోరు వెచ్చటి నీరు, ఉప్పు కలిపి ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండి మొత్తాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ ముద్దలను పీటమీద చపాతీల్లాగా ఒత్తుతూ గుండ్రంగా చేసుకోవాలి. అలా పిండి మొత్తాన్ని తయారు చేసుకున్న తరువాత...

వీటిని అట్ల పెనం మీద వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. ఈ జొన్న రొట్టెలకు వెల్లుల్లి కలిపిన కారం, వెన్నతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

క్యాప్సికం, టమాటో, ముల్లంగి కలిపి పచ్చడి



కావలసిన పదార్థాలు:
రెండు పెద్ద ఆకుపచ్చ క్యాప్సికం
రెండు టమాటోలు
ఒక ముల్లంగి
కాసిని పచ్చిమిరపకాయలు
తరిగిన కొత్తిమీర మరింత
తగినంత చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు
పోపుకు నూనె, ఎండు మిరపకాయలు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ
తయారు చేసే పద్ధతి:
ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగాలి. ముల్లంగి చెక్కును తీయాలి. క్యాప్సికం, టమాటోలను పెద్దముక్కలుగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసి పెట్టుకోవాలి. చెక్కు తీసిన ముల్లంగిని తురమాలి. పచ్చిముల్లంగి ఘాటైన వాసన ఉంటుంది కాబట్టి తురిమి నూనెలో వేయిస్తే ఆ ఘాటు పోతుంది. కాబట్టి బాణలిలో కాస్త నూనె వేసి తురిమిన ముల్లంగిని అందులో వేయాలి. రెండు నిమిషాల తరువాత క్యాప్సికం, టమాటో ముక్కలు, కాస్త చింతపండు, పచ్చిమిరపకాయలు ఆ బాణలిలో వేయాలి. వీటిపై కాస్త ఉప్పు, పసుపు వేసి ఒక 5-7 నిమిషాల పాటు ఎక్కువమంటలో తిప్పుతూ ఉండాలి. టమాటోలు, క్యాప్సికం ముక్కలు మెత్తబడతాయి. అప్పుడు కొత్తిమీర వేసి ఒక నిమిషం ఉంచాలి. పూర్తిగా ముక్కలు మెత్తబడకముందే బాణలిని దించేసి, వేడి ముక్కలను చల్లార్చాలి.
ఇంకో బాణలిలో కాస్త నూనె వేసుకొని ఎండు మిరపకాయలు నాలుగు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు వేసి పోపు చేయాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత ఇంగువ వేయాలి. కావలనుకుంటే కాసిని ధనియాలు కూడా ఈ పోపులో వేయవచ్చు. తప్పనిసరి కాదు. స్టవ్ కట్టేసి బాణలిలోని పోపును చల్లారనివ్వాలి.
మిక్సర్లో మొదట పోపును, కాస్త బెల్లం వేసి రుబ్బాలి. మెత్తగా అయిన తరువాత చల్లారిన కూరగాయల మిశ్రమాన్ని వేసి రుబ్బాలి. ముక్కలు పూర్తిగా గుజ్జుకాకుండా తక్కువ స్పీడులో మిక్సర్ ఒక 10 సెకండ్లు వేయాలి. పచ్చడిని పాత్రలోకి తీసుకొని ఉప్పు సరి చూసుకొని కావాలంటే వేసుకొని కలుపుకోవాలి. తరిగిన కొత్తిమీరను పచ్చడిపై అలంకరించుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే ఆహా!

Friday, October 16, 2015

• చిలగడదుంప వడలు

కావలసినవి 
చిలగడదుంపలు: రెండు, సెనగపిండి: అరకప్పు, బియ్యప్పిండి: 2 టీస్పూన్లు, అల్లం,పచ్చిమిర్చి ముద్ద: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: పావుకప్పు, కరివేపాకు: 4 రెమ్మలు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

ముందుగా చిలగడదుంపలను ఉడికించి పొట్టు తీసేసి మెత్తగా చిదమాలి. దీన్ని ఓ గిన్నెలో వేసి అందులోనే అల్లం, పచ్చిమిర్చిముద్ద, సెనగపిండి, బియ్యప్పిండి, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్దను చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీస్తే చిలగడదుంప వడలు రెడీ.

Tuesday, October 13, 2015

ఉల్లి బజ్జీ

కావలసిన పదార్థాలు...
3, 4 మధ్యస్థంగా గల ఉల్లి పాయలు(నిలువు చీలిలుగా కోయాలి). రుచికి ఉప్పు, వేయించడానికి తగినంత నూనె.
పిండికోసం...
ఒక కప్పు శనగపిండి, ఒక టీస్పూన్‌ కారం, ఒక టీస్పూన్‌ జీరపొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్‌ పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె, ఒక టీస్పూన్‌ మిక్స్‌డ్‌ హెర్బ్‌‌స
తయారుచేసే విధానం...
ఉల్లిపాయలు కడిగి స్లైసులుగా కోశాక వాటికి ఉప్పు పట్టించి, పది నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటి నుంచి నీటిని పిండేసి శనగపిండిలో క లపాలి. మిగతా పదార్థాలన్నీ కూడా క లపాలి. అవసరం అయితే నీరు ఉపయోగించాలి. మిశ్రమం మరీ జారుగా నూ, అలా అని గట్టిగానూ ఉండకూడదు. మధ్యస్థంగా ఉండే సెగపై నూనె వేడి చేసి, ఉల్లి, శనగపిండి మిశ్రమాన్ని స్పూన్‌ నిండుగా వేస్తూ, అన్నివైపులా కాల్చుకోవాలి. లేత బం గారు రంగులోకి వచ్చాక కిచెన్‌ పేప రుపై పరిచి, అదనపు నూనె తీశాక వేడివేడిగా వడ్డించాలి. పుదీనా లేదా కొత్తిమీర పచ్చడి లేదా టొమేటో కెచప్‌ నంజుకుని తింటే మహా రుచిగా ఉంటాయి.

* క్షీరాన్నం

• కావల్సినవి: బియ్యం - అరకప్పు, చిక్కని పాలు - నాలుగుకప్పులు, చక్కెర - ముప్పావుకప్పు, యాలకులపొడి - కొద్దిగా.

• తయారీ: బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక అందులో బియ్యం వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే అన్నం ఉడుకుతుంది. అన్నం మెత్తగా అయ్యాక యాలకులపొడి వేసి కలిపి దింపేయాలి. తరవాత ఇందులో చక్కెర వేసి అది కరిగేదాకా కలపాలి.

* తీపి గారెలు


• కావల్సినవి: మినప్పప్పు - కప్పున్నర ఉప్పు - కొద్దిగా, బెల్లం - రెండున్నర కప్పులు, నూనె - వేయించేందుకు సరిపడా, యాలకులపొడి - చెంచా.

• తయారీ: మినప్పప్పును ముందు రోజు నానబెట్టుకోవాలి. మర్నాడు నీటిని వంపేసి గారెల పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత బాణలిలో వేయించేందుకు సరిపడా నూనెను తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకుని కవరుపై గారెలా తట్టుకుని నూనెలో వేసి మంట తగ్గించాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం తరుగును ఓ గిన్నెలోకి తీసుకుని పావుకప్పు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగి లేత పాకంలా అయ్యాక దింపేయాలి. పాకం కొద్దిగా చల్లారాక అందులో యాలకులపొడి కలపాలి. తరవాత ఈ గారెల్ని అందులో వేసి కాసేపయ్యాక తీసేయాలి.

* పెసర గారెలు


• కావల్సినవి: పెసలు - కప్పు, మినప్పప్పు - రెండు చెంచాలు, అల్లం తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - కొద్దిగా, జీలకర్ర - చెంచా, పచ్చిమిర్చి - ఐదారు, నూనె - వేయించేందుకు సరిపడా.
• తయారీ: పెసలనీ, మినప్పప్పునీ ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు ఆ నీళ్లు పూర్తిగా వంపేసి ఈ రెండింటినీ కలిపి గట్టి పిండిలా రుబ్బుకుని పెట్టుకోవాలి. అదే మిక్సీజార్‌లో అల్లం, పచ్చిమిర్చీ, ఉప్పూ, జీలకర్రా మెత్తగా చేసుకుని ఈ పిండిలో కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. అది వేడయ్యాక ఈ పిండిని రెండుమూడు గారెల చొప్పున తట్టుకుని అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి.

* కదంబం

• కావల్సినవి: బియ్యం - కప్పు, కందిపప్పు - అరకప్పు, పెసరపప్పు - టేబుల్‌స్పూను, బెండకాయ, మునక్కాయ, చిలగడదుంప, వంకాయ, క్యారెట్ - ఒక్కోటి రెండుచొప్పున, సొరకాయ, తీపిగుమ్మడికాయ - చిన్న ముక్క చొప్పున, బీన్స్ - ఐదారు, బంగాళాదుంప - ఒకటి, చింతపండు గుజ్జు - ఒకటిన్నర టేబుల్‌స్పూను, సాంబారుపొడి - మూడు చెంచాలు, పసుపు - చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండుటేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు - రెండుమూడు, ఎండుమిర్చి - మూడు, ఇంగువ - పావుచెంచా, ఉప్పు - తగినంత.

• తయారీ: బియ్యం, కందిపప్పూ, పెసరపప్పూ కుక్కర్‌లోకి తీసుకుని బాగా కడగాలి. తరవాత అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. మూడుకూతలు వచ్చాక దింపేయాలి. మరో కుక్కర్ గిన్నెలో కూరగాయ ముక్కలన్నీ తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి పసుపు వేసి పొయ్యిమీద పెట్టాలి. ఒక కూత వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఈ కూరగాయముక్కల్లో చింతపండుగుజ్జూ, తగినంత ఉప్పూ, సాంబారుపొడీ వేసి బాగా కలిపి మరోసారి పొయ్యిమీద పెట్టాలి. ఐదు పది నిమిషాలయ్యాక ఇందులో ముందుగా ఉడికించిన అన్నం కలిపి మంట తగ్గించాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి కరిగించి ఇంగువా, ఎండుమిర్చీ, ఆవాలూ, జీలకర్రా, కరివేపాకు రెబ్బలూ వేయాలి. అన్నీ వేగాక ఈ తాలింపును అన్నంపై వేసి కలిపి పొయ్యి కట్టేయాలి.

* బెల్లం రవ్వకేసరి

• కావల్సినవి: బొంబాయిరవ్వ - కప్పు, బెల్లం తరుగు - కప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు - రెండూ కలిపి పావుకప్పు, యాలకులపొడి - అరచెంచా, నీళ్లు - రెండుంబావు కప్పులు.

• తయారీ: బాణలిలో చెంచా నెయ్యి వేడిచేసి రవ్వను కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి. అలాగే మరో చెంచా నెయ్యి వేడిచేసి జీడిపప్పూ, కిస్‌మిస్ పలుకుల్ని వేయించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో చాలా కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. అందులో బెల్లం వేసి మంట తగ్గించాలి. బెల్లం కరిగాక దింపేయాలి. మరో బాణలిలో మిగిలిన నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యీ, రవ్వా వేసి మంట తగ్గించేయాలి. రవ్వ ఉడికాక బెల్లం కరిగించిన నీరు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతుంటే కాసేపటికి కేసరి దగ్గరకు వస్తుంది. అప్పుడు మిగిలిన నెయ్యీ, వేయించి పెట్టుకున్న జీడిపప్పూ, కిస్‌మిస్ పలుకులూ, యాలకులపొడీ వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత దింపేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. కావాలనుకుంటే బిళ్లల్లా కోసుకోవచ్చు.

Friday, October 9, 2015

క్యాబేజీ కార్న్‌ రోల్స్‌

• కావలసినవి: క్యాబేజీ- అరకేజి, మొక్కజొన్నలు (ఉడకబెట్టిన)- పావుకప్పు, గరంమసాలా, మిరియాలపొడి- అరటీస్పూన్‌ చొప్పున, పాలకూర(తరిగి, ఉడికించిన)- ముప్పావుకప్పు, మీగడ- పావుకప్పు, బ్రెడ్‌ ముక్క- ఒకటి, చీజ్‌- నాలుగు టేబుల్‌స్పూన్లు, వాము- పావు టీస్పూన్‌, ఉప్పు- తగినంత.
• తయారీ: క్యాబేజీ పైన ఉన్న ఆకుల్ని, కాండాన్ని తొలగించి మిగిలిన దాన్ని నాలుగు నిమిషాలపాటు ఉడికించాలి. చల్లారిన తరువాత ఎనిమిది ఆకుల్ని నెమ్మదిగా ఒలిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్న, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి, పాలకూర, మీగడ, బ్రెడ్‌ ముక్కలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా క్యాబేజీ ఆకులపై పెట్టి అది బయటకి రాకుండా ఆకుల్ని మడవాలి. వీటికి కొంచెం నూనె రాసి ఇరవై ఐదు నిమిషాలపాటు ఓవన్‌లో వేడి చేయాలి. అంతే..! వేడి వేడి క్యాబేజీ రోల్స్‌ రెడీ...వీటిపై టొమాటో సాస్‌ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.

Thursday, October 8, 2015

* ఆనియన్‌ రవ్వ దోశ

• కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - అర అంగుళం (సన్నగా తరగాలి)
మిరియాలు - అర టీస్పూను
జీలకర్ర - పావు టీస్పూను
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 3
వేయించిన జీడిపప్పు పలుకులు - 3 టీస్పూన్లు
• తయారీ విధానం:
బియ్యం పిండి, రవ్వలకు నీళ్లు చేర్చి గంట జారుడుగా కలుపుకోవాలి.
జీలకర్ర, ఉప్పు పిండిలో వేసి కలపాలి.
పిండిని 4 గంటలపాటు పక్కన ఉంచి.. పులియనివ్వాలి.
ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి.
పెనం వేడిచేసి కాసింత నూనె పోయాలి.
పిండిని దోశలా పోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు చల్లాలి.
నూనె పోసి దోశ కాల్చాలి.
వేడిగా సాంబార్‌ లేదా చట్నీతో వడ్డించాలి.

* చీజ్‌ చిల్లీ దోశ

• కావలసిన పదార్థాలు:
బియ్యం - అర కిలో
మినప్పప్పు - 100 గ్రా
శనగపప్పు - 50 గ్రా
ఉప్పు - తగినంత
చీజ్‌ - 50 గ్రా
పచ్చిమిర్చి - కొన్ని ముక్కలు

• తయారీ విధానం:
బియ్యం, పప్పు రాత్రంతా నానబెట్టాలి.
పొద్దున్నే ఉప్పు కలుపుకోవాలి.
పెనం వేడి చేసి ముందుగా నూనె పూసి తర్వాత నీళ్లు చల్లాలి.
పిండిని దోశగా పోసుకోవాలి.
చీజ్‌, పచ్చిమిర్చి తరుగు పట్టించాలి. నూనె వేసి దోరగా కాల్చి తీయాలి.

Tuesday, October 6, 2015

• మెంతి, పెసరపప్పు అట్టు..

• మెంతి, పెసరపప్పు అట్టు..

ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో పోషక విలువలు బాగా ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు: బియ్యం- ఒక కప్పు, పెసరపప్పు- అరకప్పు, తరిగిన మెంతి- కప్పు, తరిగిన అల్లం ముక్కలు- ఒక టేబుల్‌ స్పూను, సిలాంత్రో- ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు-తగినంత.

తయారుచేసే విధానం: బియ్యం, పెసరపప్పులను రెండు గంటల పాటు నీళ్లల్లో వేసి నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ పిండిని రూమ్‌ టెంపరేచర్‌లో నాలుగు గంటల పాటు అలానే ఉంచాలి. తర్వాత అందులో తరిగిన అల్లంముక్కలు, మెంతి వేసి కలపాలి. ఉప్పు తగినంత వేయాలి. ఆ తర్వాత వేడి పెనం మీద నూనె వేసి ఈ పిండిని అట్టులా పోయాలి. ఈ అట్లు ఎంతో రుచిగా ఉంటాయి.
రాగులు జీర్ణకోశానికి ఎంతో మంచిది. అంతేకాదు ఇందులో అధికపాళ్లల్లో ఐరన్‌ ఉంటుంది. ఇది మనల్ని అన్ని రకాల వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
కావాల్సిన పదార్థాలు: రాగిపిండి-రెండు టేబుల్‌స్పూన్లు, పాలు-250 గ్రాములు, బెల్లం-1.5 టేబుల్‌స్పూన్‌, ఏలక్కాయలు-2, రోస్టెడ్‌ బాదంపప్పులు-తగినన్ని.
తయారుచేసే విధానం: రాగి పిండిని కడాయిలో వేసి రెండు మూడు నిమిషాలు వేయించి తర్వాత బాగా చల్లారనివ్వాలి. రాగిపిండి, పాలు బాగా కలిసిపోయేలా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని స్టవ్‌ మీద పెట్టి దగ్గర పడేవరకూ ఉడికించాలి. ఆ మిశ్రమం క్రీములా తయారవుతుంది. అందులో బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలో పోసి వేయించిన బాదంపప్పులతో దాని పైభాగాన్ని అలంకరించాలి.
ఇది తింటే జీర్ణాశయానికి ఎంతో మంచిది.

పూర్ణం కుడుములు


కావలసిన పదార్థాలు:
శనగపప్పు - ముప్పావు కప్పు
బెల్లం - ఒక కప్పు
తాజా కొబ్బరి తురుము - 3 టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి - చిటికెడు
బియ్యంపిండి - ఒకటిన్నర కప్పు, నీళ్లు - తగినన్ని
నెయ్యి - 1 టీ స్పూన్‌, ఉప్పు - చిటికెడు
తయారీ విధానం: శనగపప్పు మునిగేంత నీరు పోసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా వేళ్లతో నొక్కితే చితికేంత మేరకే ఉడికించుకోవాలి. తడిలేకుండా చూసుకోవాలి. తర్వాత పప్పును చల్లార్చి పొడి చేసుకోవాలి. గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టాలి. పాకంలో శనగపప్పు పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. మిశ్రమం పిండి ముద్దగా మారాక మంట తీసేయాలి. పూర్తిగా చల్లారాక ఉండలు కట్టుకుని పక్కనుంచుకోవాలి. నీళ్లు, నెయ్యి, ఉప్పు కలిపి మరిగించుకోవాలి. బియ్యంపిండిని ఓ గిన్నెలో తీసుకుని మరిగించిన నీటిని చేర్చుతూ పిండి కలుపుకోవాలి. 2 నిమిషాలాగి వేడిగా ఉన్నప్పుడే పిండి మెత్తబడే వరకూ పిసుక్కోవాలి. చేతికి నూనె పూసుకుని పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఉండలను చేత్తో చిన్న పూరీల్లా వత్తుకుని వాటి మధ్యలో శనగ ఉండను ఉంచి గుండ్రంగా చుట్టాలి. ఇలా తయారుచేసిపెట్టుకున్న కుడుములను 10 -12 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించి చల్లారాక వడ్డించాలి.

సేమ్యా ఉప్మా... రుచిగా రావాలంటే?

• ఎప్పుడూ ఇడ్లీ, దోశ అని కాకుండా ఇంట్లో సేమ్యా ఉప్మా కూడా ప్రయత్నిస్తుంటా. కానీ నేనెలా చేసినా ఇంట్లో వాళ్లకి నచ్చడం లేదు. సేమ్యాను నూనెలో వేయించి పక్కన పెట్టుకుని తరవాత తాలింపు వేసి.. నీళ్లు పోసి మరిగిస్తా. అందులో సేమ్యా వేసి కాసేపయ్యాక మిగిలిన నీటిని వంపేస్తా.. ఐదునిమిషాలు సేమ్యాను మగ్గనిచ్చి చివరగా కొత్తిమీర చల్లి దింపేస్తున్నా. ఇందులో రకరకాల కాయగూరలు వేసినా బాగా లేదని చెబుతున్నారు. దీనికేదయినా పరిష్కారం ఉందా?
-హెచ్.ఎం లక్ష్మి, చిత్తూరు

* మీరు తెల్లగా ఉండే సేమ్యాను వాడుతున్నట్లున్నారు. ఈసారి వేయించిన సేమ్యా అని బజార్లో దొరుకుతుంది. కాస్త ఎర్రగా ఉండే దాన్ని తెచ్చుకోండి. తాలింపు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిర్చి ముక్కలూ వేశాక కప్పు సేమ్యాకు రెండు కప్పుల నీళ్లు పోయండి. అవి మరిగాక సేమ్యా వేసి కలిపి మూత పెట్టేయండి. సేమ్యా యాభైశాతం ఉడికిందనుకున్నాక మంట బాగా తగ్గించండి. మధ్యలో సేమ్యాను గరిటెతో కలపకూడదు. అప్పుడే మిగిలిన నీటిని సేమ్యా పీల్చుకుని చక్కగా ఉడుకుతుంది. నూనె కూడా కొద్దిగా ఎక్కువగా వేస్తేనే సేమ్యా పొడిపొడిగా వస్తుంది. నూనె బదులు నెయ్యి వాడితే ఇంకా రుచిగా ఉంటుంది.
సేమ్యాను మరో పద్ధతిలోనూ చేసుకోవచ్చు. సేమ్యాకు సరిపడా నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టి అందులో అరచెంచా ఉప్పూ, చెంచా నూనె వేయాలి. నీళ్లు మరిగాక సేమ్యా వేయాలి. యాభై శాతం ఉడికాక వెంటనే దింపేసి చన్నీళ్లలో వేయాలి. రెండు నిమిషాల తరవాత ఆ నీటిని వంపేసి నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో తాలింపు వేయించుకుని, కావల్సిన కూరగాయముక్కలు వేయాలి. అవి వేగాక ఉడికించి పెట్టుకున్న సేమ్యా, సరిపడా ఉప్పూ వేసి మంట తగ్గించేయాలి. ఇది సన్నని మంటపై మగ్గి.. పొడిపొడిగా వస్తుంది.
ఇలా ఉడికించిన సేమ్యాతో హరియాలీ ఉప్మా కూడా చేసుకోవచ్చు. సేమ్యా మోతాదుని బట్టి కొత్తిమీరా, పుదీనా, చిన్న అల్లంముక్కా, పచ్చిమిర్చీ కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో మూడు చెంచాల నూనె వేడిచేసి, ఈ కొత్తిమీర మసాలా, తగినంత ఉప్పూ వేసి వేయించాలి. పచ్చివాసన పోయాక ఉడికించిన సేమ్యా వేసి బాగా కలిపితే సరి. సాధారణ సేమ్యాను ఉడికిస్తున్నప్పుడు ఎక్కువగా కలిపితే ముక్కల్లా విరిగిపోతాయి. అందుకే కొంత ఉడికాక, మూత పెట్టేసి మంట తగ్గించి మగ్గనివ్వాలి.

బందరు లడ్డూ

• కావలసినవి 
సెనగపిండి: 2 కప్పులు, యాలకులపొడి: కొద్దిగా, నెయ్యి: కప్పు, వంటసోడా: అరటీస్పూను, పంచదార: కప్పు, నూనె: వేయించడానికి సరిపడా

• తయారుచేసే విధానం

* బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఈలోగా ఓ గిన్నెలో సెనగపిండి, నీళ్లు, వంటసోడా వేసి ఉండలు లేకుండా కలపాలి. పిండిలో ఇష్టమైతే కొద్దిగా పాలు కూడా కలుపుకోవచ్చు. తరవాత ఓ స్పూను నెయ్యి వేసి కలిపి పిండిముద్దని జంతికల గొట్టంలో వేసి కాగిన నూనెలో కారప్పూసను వత్తి రెండు వైపులా తిప్పుతూ రెండు నిమిషాలు వేయించి తీయాలి. కారప్పూస మెత్తగానే ఉండాలి కానీ కరకరలాడేవరకూ వేగకూడదు. ఇలాగే పిండి అంతటినీ కారప్పూసలా చేసుకుని అది ఆరాక చేతులతో చిదిమి, మిక్సీలో వేసి మెత్తని పొడి చేయాలి.

* లడ్డూలు మరీ మెత్తగా కావాలనుకుంటే పిండిని జల్లించి నూకను మళ్లీ మిక్సీలో వేయాలి.

* మరో స్టవ్‌మీద పాన్‌లో పంచదార వేసి కప్పు నీళ్లు పోసి తీగ పాకం రానిచ్చి యాలకులపొడి, టేబుల్‌స్పూను నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కారప్పూస పిండిని పాకంలో వేసి కలుపుతూ ఉడికించాలి. ఎంత బాగా కలిపితే లడ్డూ అంత రుచిగా ఉంటుంది. కాస్త చిక్కగా అయ్యాక మిగిలిన నెయ్యి వేసి పాన్‌కు అంటుకోకుండా పొడిగా అయ్యేవరకూ కలియతిప్పుతూ ఉడికించి దించాక, లడ్డూల్లా చుట్టుకోవాలి.

Monday, October 5, 2015

సజినా

కావల్సినవి: మునక్కాయలు - ఐదు, ఆవాలు - మూడు చెంచాలు (నానబెట్టుకోవాలి), వెల్లుల్లి రెబ్బలు - ఐదు, బంగాళాదుంపలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, ఎండుమిర్చి - మూడు, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా, నూనె - పావుకప్పు, నీళ్లు - కప్పు.

తయారీ: ముందుగా నానబెట్టిన ఆవాలూ, వెల్లుల్లి రెబ్బలూ, ఉల్లిపాయ ముక్కలూ, ఎండుమిర్చీ.. మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. మునక్కాయల్ని చిన్నముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ముందుగా చేసిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేయాలి. అది వేగాక మునక్కాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలూ వేయాలి. అవి కాస్త వేగాక నీళ్లు పోసి మూత పెట్టేయాలి. బంగాళాదుంప ముక్కలు ఉడికాక తగినంత ఉప్పూ, పసుపూ వేసి దింపేయాలి.

Sunday, October 4, 2015

క్యాబేజీ కూర

కావలసిన పదార్థాలు:
============

క్యాబేజీ గడ్డ ఒకటి
పెసరపప్పు (1 కిలో క్యాబేజీకి 100 గ్రాములు)
తురిమిన లేత కొబ్బరి
కరివేపాకు
పచ్చిమిరపకాయలు
కొత్తిమీర
కావలసినంత ఉప్పు, పసుపు, వంట నూనె

తయారు చేసే విధానం:
===============

ముందుగా క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత రుచి, అంత తొందరగా ఉడుకుతుంది. తరిగిన క్యాబీజిని కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి నీళ్లు పోయాలి. నీళ్ల పరిమాణం క్యాబేజీ మెత్తబడేంత వరకే. అంటే ముక్కలు తేలేలా పోయకూడదు. క్యాబేజీలో నీరు ఉంటుంది కాబట్టి ఎక్కువ పోయక్కర్లేదు. కాస్త ఉప్పు, పసుపు వేసి కుక్కర్ మూత, విజిల్ పెట్టి పొయ్యిపై పెట్టాలి. ఒక రెండు విజిల్స్ వచ్చిన తరువాత కుక్కరును దించి ఒక చన్నీటి పాత్రలో ఉంచాలి. కాస్త చల్లారాక విజిల్ తీయాలి. మొత్తం ఆవిరి దానంతట అదే పోయేంతవరకు ఉంచితే ముక్కలు, పెసరపప్పు మరీ మెత్తబడిబోతాయి. ఒకవేళ ఉడికిన క్యాబేజీలో నీరు మిగిలితే ఒక పాత్రలోకి వడకట్టుకొని చారు/సాంబారు లోకి లేదా సూప్ లాగా కూడా తాగ వచ్చు. అందుకే నీళ్లు ఎక్కువ మిగలకుండా కుక్కర్లో ఉడికించటం ఈ కూరకు కీలకం.

పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. బాణలిలో కాస్త నూనే వేసి వేడి చేయాలి. క్యాబేజీ ముందే ఉడికింది కాబట్టి చాల తక్కువ నూనె పడుతుంది. నూనెలో శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. కాస్త రంగు మారుతున్నప్పుడు ఆవాలు జీలకర్ర వేయాలి. ఇవి చిటపటలాడగానే తరిగిన పచ్చిమిరప, కరివేపాకు వేసి, ఒక అర నిమిషం తరువాత క్యాబేజీని కుమ్మరించాలి. కుక్కర్లో మొదట వేసిన ఉప్పును బట్టి మరల కావలసివస్తే ఉప్పు వేసుకోవచ్చు. తురిమిన లేత కొబ్బరిని వేసి ఎక్కువ వేడిపై ఒక 7-8 నిమిషాలు మూత పెట్టకుండా తీపుతూ ఉండాలి. కొబ్బరి పెసరపప్పు కన్నా ఎక్కువ ఉండకూడదు. క్యాబేజీలో నీరంతా ఇంకిపోయిన తరువాత తరిగిన కొత్తిమీర అలంకరించి హాట్ప్యాక్‌లోకి మార్చుకొని మూత పెట్టాలి.

నూనె తక్కువ కాబట్టి కొవ్వు తక్కువ, పెసరపప్పుతో మాంసకృత్తులు, కొబ్బరితో మంచి కొవ్వు, క్యాబేజీ ఔషధ గుణాలు కలిగిన ఈ కూర పరిపూర్ణమైన ఆహారం. దీనిని పుల్కాలు/చపతీలు/అన్నంతో తినవచ్చు. మొత్తం 15 నిమిషాల్లో కూర సిద్ధం చేసుకోవచ్చు.

Friday, October 2, 2015

కొర్రలతో దోశలు

మనకు ఇప్పుడు తక్కువ కాలరీలతో రుచికరైన ఉపాహారాలు చాలా అవసరం . మన భారతీయ , వెజి టేరియన్ ఫుడ్ లో ప్రోటీన్ చాలా తక్కువ . మనం రోజూ తినే ఇడ్లీ , దోశ , రక రకాల ఉప్మాలు , వడ వీటిల్లో కార్బో హైడ్రేట్లు ఎక్కువ .. 40 ఇయర్స్ దాటాక ఇవి అస్సలు మంచివి కావు . అవిసగింజలు (Flax seeds), కొర్రలు (fox tail in English ), రాగులు , సజ్జలు , జొన్నలు ఎక్కువగా తీసుకోవాలి . వీటితో రుచికరమైన టిఫిన్స్ చేసుకోవచ్చు . కొర్రలు ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్నాయి . పోట్టుతీసినవి తెచ్చుకోవాలి . ఇవి కొర్ర బియ్యం అంటారు . బియ్యానికి బదులుగా అన్నం , కిచిడి వండుకోవచ్చు. .. బియ్యప్పిండికి బదులుగా కోర్రపింది వాడుకోవచ్చు . కొర్ర పాయసం , పులిహోర , ఫ్రైడ్ రైస్ ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు .. కావలసినంత ప్రోటీను లభిస్తుంది . ఒకరకంగా ఇండియన్ కీన్వా అనుకోవచ్చు .
కొర్రలతో దోశ రెసిపీ చెప్తాను .
ఒకకప్పు మినప్పప్పు , రెండు కప్పుల కొర్రలు , ఒక కప్పు బియ్యం , పావు కప్పు రాగులు ,రెండు స్పూన్ల మెంతులు , పావు కప్పు పచ్చి శనగ పప్పు , పెద్ద స్పూన్ పెసర పప్పు . అన్నీ 6 గంటలు నానా బెట్టి మెత్తగా రుబ్బి ,
రెండుగంటలు పులవ నివ్వాలి . పిండి లో ఉప్పు కలిపి పల్చగా దోశలు పోసుకోవాలి . చాలా క్రిస్పీగా , రుచి గా ఉండే కొర్ర దోశలు రెడీ !
ఇదే పిండి , గుంత పొంగణాలు చేసుకోవచ్చు .. అల్లం , పచ్చిమిర్చి , కారెట్ తురుము వేసి .
మినప రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు .. అయితే నూనె ఎక్కువగా పడుతుంది ..
కాలరీలు అవాయిడ్ చెయ్యాలిగా మరి ..
వీటిలోకి పల్లీ చట్నీ కాకుండా , టమాటోలు , పచ్చిమీర్చి , కొత్తి మిర తో పచ్చడి , పుట్నాల
పచ్చడి , కొబ్బరి , పుట్నాలు కలిపి పచ్చడి అయితే మంచిది .. అదనపు కాలరీలు చేరకుండా ! మరి చేసి చూడండి .. మీకే
తెలుస్తుంది వీటి రుచి !

క్రిస్పీ కాకరకాయ ఫ్రై విత్ కోకనట్

చేదు లేకుండా కాకరకాయను హెల్తీగా ఎలా తినవచ్చు? అందుకు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రుచి కలిగిన కాకరకాయ ఫ్రై రిసిపిని మీకు అందిస్తున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు, ఉప్పుతో మ్యారినేట్ చేసి, రసం తీసేయడం వల్ల చేదు ఉండదు. అలాడే డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. మరి ఈ క్రిస్పీఅండ్ టేస్టీ బిట్టర్ గార్డ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
కాకరకాయ: 6 (సన్నగా రౌండ్ గా కట్ చేసుకోవాలి)
పచ్చిశెనగపప్పు: 1tbsp
జీలకర్ర : ½ tsp
ఆవాలు: ½ tsp
కరివేపాకు: 7-8
వెల్లుల్లి రెబ్బలు: 5
ఎండు మిర్చి: 3
కొబ్బరి తురుము: ½cup
పసుపు పొడి: ½tsp
ఎర్ర కారం పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా కాకరకాయను సన్నగా గుండ్రంగా తరిగి, ఉప్పు నీటిలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు కొద్దిగా చిలకరించి 10-15 మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కాకరకాయ ముక్కలను చేతిలోకి తీసుకొని రసాన్ని పిండేసి, తర్వాత పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె కాగిన తర్వాత అందులో కాకరకాయ ముక్కలు వేసి 4-5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా మరియు బ్రౌన్ కలర్ లోకి మారగానే మరో ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, వెల్లుల్లి మరియు కారం వేసి మొత్తగా పౌడర్ చేసుకోవాలి.
5. ఇప్పుడు మరో పాన్ స్టౌ మీద పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర, శెనగపప్పు, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి మరో 5నిముషాలు నిధానంగా ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా డీఫ్ ఫ్రై చేసి పెట్టుకొన్న కాకరకాయ ముక్కలు కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి.
8. కొద్దిగా ఉప్పు వేసి మరికొన్ని సెకడ్లు ఫ్రై చేసుకోవాలి. ఒక సారిగా మొత్తం వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి. అంతే క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ. దీన్ని ప్లెయిన్ రైస్ మరియు దాల్ కాంబినేషన్ తో సర్వ్ చేయవచ్చు.