Thursday, July 23, 2015

కోఫ్తా మసాలా కర్రీ

కోఫ్తా మసాలా కర్రీ

• కోఫ్తాల కోసం కావాల్సినవి ...

అరటికాయలు - మూడు, బంగాళాదుంపలు - రెండు, శెనగపిండి - పావుకప్పు, ఉప్పు - తగినంత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు - రెండు చెంచాలు, బ్రెడ్‌పొడి - పావుకప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు - పావుకప్పు, నూనె - వేయించడానికి సరిపడా, జీలకర్ర పొడి, ధనియాల పొడి - చెంచా చొప్పున.

• గ్రేవీ కోసం కావాల్సినవి ....

యాలకులు - నాలుగు, లవంగాలు - నాలుగు, దాల్చినచెక్క - రెండు ముక్కలు, పసుపు - అరచెంచా, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు చెంచాలు, టమాటా ముక్కలు - పావుకప్పు, కారం - పావుచెంచా, ఉప్పు - తగినంత, గరంమసాలా పొడి - చెంచా, గిలకొట్టిన చిక్కటి పెరుగు - రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు - పావుకప్పు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు.

• తయారీ

ముందు కోఫ్తాలను తయారు చేసుకోవాలి. అరటికాయ, బంగాళాదుంపల చెక్కు తీసేసి కాస్త పెద్ద ముక్కల్లా కోయాలి. వాటిని ఓ గిన్నెలోకి తీసుకుని సరిపడా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. వేడి చల్లారాక ఆ నీటిని వంపేసి ముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నూనె తప్ప కోఫ్తాల కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి అందులో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క ముక్కలు, ఉల్లిపాయముక్కలు వేసేయాలి. ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్టు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మంట తగ్గించాలి. రెండు నిమిషాల తరవాత టమాటా ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చల్లాలి. కాసేపటికి టమాటా ముక్కలు కూడా మగ్గి నూనె పైకి తేలుతుంది. అప్పుడు గిలకొట్టిన పెరుగు, కాసిని నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. గ్రేవీ అంతా తయారయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న కోఫ్తాలూ, గరంమసాలా వేసి బాగా కలిపి, కొత్తిమీర చల్లి దింపేయాలి. 

0 comments:

Post a Comment