Tuesday, July 28, 2015

బంగాళదుంప పుట్టు

POSTED BY జ్యోతి
FRIDAY, FEBRUARY 16, 2007

బంగాళదుంపలు 250 gm
ఉల్లిపాయలు 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమీర 2 tsp
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

ముందుగా బంగాళదుంపలను పావు స్పూను పసుపు,తగినంత
ఉప్పు వేసి కాస్త మెత్తబడేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత చెక్కు
తీసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు తరిగిన ఉల్లిపాయలు
వేసి అవి మెత్తబడేవరకు వేయించాలి.ఇప్పుడు బంగాళదుంప ముక్కలు
కారం పొడి వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి.ముందే ఉప్పు వేసాం
కాబట్టి మళ్ళీ వేసే అవసరముండదు.కావాలంటే రుచి చూసి వేసుకో
వచ్చు. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దింపేయాలి.ఇది దోశ,
పూరీ, చపాతీలోకి బావుంటుంది.

బంగాళదుంప బటానీ కూర


బంగాళదుంపలు 250 gm
పచ్చి బటానీలు 100 gm
టొమాటోలు 100 gm
ఉల్లిపాయలు 1
పచ్చిమిర్చి 2
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
కరివేపాకు 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
ఉప్పు తగినంత
కొత్తీమిర 2 tsp
గరం మసాల 1 tsp
నూనె 3 tbsp

ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి
మెత్తబడేవరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి,పసుపు,కారం,
కర్వేపాకు,బటానీలు వేసి బాగా కలిపి కొద్దిసేపు వేపాలి.ఇప్పుడు
చెక్కు తీసి ముక్కలుగా చేసిన బంగాళదుంపలు,తగినంత ఉప్పు
వేసి కలియబెత్తి మూత పెట్టాలి. కొద్దిసేపు వేగిన తర్వాత సన్నగా
తరిగిన టొమాటో ముక్కలు కూడా వేసి కలియబెట్టి కప్పుడు నీళ్ళు
పోసి నూనె తేలేవరకు ఉడికించాలి.కొత్తిమీర,గరం మసాలా చల్లి
దింపేయాలి.

మిర్చీ కా సాలన్


పొడవైన లావు పచ్చిమిరపకాయలు 1/4 kg
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
పెరుగు 1/2 కప్పు
చింతపండు పులుసు 3 tsp
పల్లీలు 3 tsp
నువ్వులు 2 tsp
కొబ్బరిపొడి 3 tbsp
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయలను మెత్తబడేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి. కొబ్బరిపొడి, పసుపు,కారం,వేయించిన నువ్వులు,పల్లీలు,అల్లం వెల్లుల్లి,చింతపండు పులుసు,పెరుగు,తగినంత ఉప్పు అన్నీ కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి. లేత బంగారు రంగులో కొచ్చిన ఉల్లిపాయలలొ ఈ నూరిన ముద్ద వేసి అడుగంటకుండా వేయించి,కప్పు నీరు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన మిరపకాయలు వేసి కలిపి నిదానంగ ఉడికించి నూనే తేలేవరకు ఉంచి దింపేయాలి. కావాలంటే మిరపకాయల బదులు వంకాయలు కూడా వాడుకోవచ్చు.

సగ్గుబియ్యం ఇడ్లీ


సగ్గుబియ్యం 2 కప్పులు
పుల్లని మజ్జిగ 2 కప్పులు
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి4
ఉప్పు తగినంత
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/2 tsp
సెనగపప్పు 1/2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 2 tbsp

సగ్గుబియ్యాన్ని పుల్లనిమజ్జిగలో కనీసం ఆరు గంటలు నానబెట్టాలి (మజ్జిగ మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి). ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుల్ని సన్నగా తరగాలి.బాణలిలో నూనె వేడి చేసి తాలింపు పెట్టి అందులో నాంబెట్టిన సగ్గుబియ్యం వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమిర సన్నగా తరిగి ఈ మిశ్రమమలో కలపాలి. ఈ సగ్గుబియ్యం పిండిని ఇడ్లీల మాదిరిగా వేసి 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. మెత్తగా ఉండే ఈ సగ్గుబియ్యం ఇడ్లీలను టోమాటో చట్నీ కాని కొబ్బరి చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి.

పప్పు చారు

కందిపప్పు 200 gm
చింతపండు 50 gm
ఉల్లిపాయ 1
టొమాటో 2
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 రెబ్బ
కొతిమిర 1 కట్ట
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 4
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp

ముందుగా కందిపప్పును కొద్దిగా పసుపు,నూనె వేసి కుక్కర్లో మెత్తగా
ఉడికించుకోవాలి. చింతపండు నీళ్ళలోనానబెట్టాలి . ఉల్లిపాయ,పచ్చిమిర్చి,
టొమాటోలు తరిగి పెట్టుకోవాలి. పప్పును గరిటతో మెదిపి చింతపండు
పులుసు తీసి అందులో కలపాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడి చేసి
ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర వేసిఅవి చిటపటలాడాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
టొమాటో ముక్కలు వేసి కొద్దిగావేపాలి. పసుపు,కారంపొడి,కరివేపాకు వేయాలి.
అవి మెత్తబడ్డాక పప్పు మిశ్రమాన్ని అందులో పోసి తగినంతఉప్పు,కొద్దిగా బెల్లం
కాని చక్కెర కాని వేయాలి. పప్పు చారు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత
కొత్తిమిర వేసిదింపేయాలి. కొద్దిగ నెయ్యి వేస్తె సూపర్ గా ఉంటుంది

• మేథీ రోటీ

కావల్సినవి: గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, మెంతికూర తరుగు - ముప్పావుకప్పు, సాంబారుపొడి - చెంచా, గరంమసాలా - ముప్పావుచెంచా, పసుపు - పావుచెంచా, జీలకర్ర - చెంచా, ఉప్పు - కొద్దిగా, నూనె - అరకప్పు, మజ్జిగ - పిండికలిపేందుకు సరిపడా.

తయారీ:బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి కడిగిన మెంతికూరను వేయించాలి. దాన్నుంచి పచ్చివాసన పోయాక దింపేయాలి. గోధుమపిండిలో మజ్జిగ తప్ప మెంతికూరతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తరవాత మజ్జిగ పోసుకుంటూ చపాతీపిండిలా కలపాలి. ఈ పిండిని చపాతీల్లా వత్తుకుని పెనంపై వేసి నూనెతో రెండువైపులా కాల్చుకుంటే సరిపోతుంది.

• పెరుగూ, సెనగపిండితో రోటీ



కావల్సినవి:గోధుమపిండి - రెండున్నర కప్పులు, సెనగపిండి - రెండు కప్పులు, చిక్కటి పెరుగు - అరకప్పు, సోంపు - చెంచా, కారం - చెంచా, జీలకర్ర - అరచెంచా, ఉప్పు - కొద్దిగా, నెయ్యి - పావుకప్పు, కొత్తిమీరా - కొద్దిగా.

తయారీ: నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా చేసుకోవాలి. ఈ పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. తరవాత దీన్ని వేడిపెనంపై ఉంచి, నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇలానే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఈ రోటీలను ఉల్లిపాయ రైతా లేదా ఏదయినా చట్నీతో తినొచ్చు.


Monday, July 27, 2015

మసాలా కారప్పొడి


ఎండుమిరపకాయలు 1 kg
ధనియాలు 250 gm
యాలకులు 50 gm
లవంగాలు 50 gm
దాల్చిన చెక్క 100 gm
షాజీర 50 gm
వెల్లుల్లి 100 gm
పసుపు 4 tsp

పై వస్తువులన్ని కలిపి మెత్తగా పొడి చేసుకుని కూరలలో వాడుకుంటే ప్రత్యేకమైన
రుచి వస్తుంది

ధనియాల పొడి

ధనియాలు 100 gm
ఎండుమిర్చి 50 gm
మినపప్పు 25 gm
ఆవాలు 1 gm
వేరుసెనగపప్పు 25 gm
సెనగపప్పు 25 gm
చింతపండు అర నిమ్మపండంత
నూనె 4 tbsp
ఉప్పు తగినంత

బాణలిలో నూనే వేడి చేసి ఎండుమిర్చి, పప్పులు, ఆవాలు, చింతపండు
రెక్కలు విడివిడిగా వేపాలి.చల్లారిన తర్వాత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి.

సాంబారు పొడి


కందిపప్పు 100 gm
ఎండుమిర్చి 50 gm
ధనియాలు 50 gm
సెనగపప్పు 25 gm
మినపప్పు 25 gm
జీలకర్ర 25 tsp
మిరియాలు 1 tsp
మెంతులు 1 tsp
పసుపు చిటికెడు
నూనె 1 tsp
ఉప్పు తగినంత



బాణలిలో ఒకచెంచా నూనె వేడి చేసి అన్నింటిని విడివిడిగా బాగా రంగు
వచ్చి కమ్మని వేగిన వాసన వచ్చేంత వరకు వేపి ఉప్పు కలిపి చల్లారిన
తర్వాత మెత్తగా మిక్సీలో పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

రసం పొడి


ధనియాలు 100 gm
జీలకర్ర 25 gm
మిరియాలు 20 gm
పసుపు 1/4 tsp

పై వస్తువులన్ని కొద్దిగా వేపి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి
పెట్టుకోవాలి. రసం మరిగేటప్పుడు తగినంత రసం పొడి వేసి
చితక్కొట్టిన వెల్లుల్లి రేకలు తప్పకుండా వేయాలి. అప్పుడే రసం
రుచి వస్తుంది.

ఇడ్లీ పొడి


ఎండు మిర్చి 10
గుల్ల సెనగపప్పు 250 gm
ఎండుకొబ్బరి పొడి 50 gm
జీలకర్ర 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tsp


బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పప్పు, జీలకర్ర విడివిడిగా వేపి
తీసి చల్లారిన తర్వాత ఉప్పు,కొబ్బరి తురుము కలిపి మిక్సీలో మెత్తగా
పొడి చేసుకోవాలి.

కూర పొడి


ఎండుమిరపకాయలు 10
ధనియాలు 100 gm
జీలకర్ర 2 tsp
పసుపు 1 sp
ఉప్పు తగినంత

పై వస్తువులని కొద్దిగా వేపి మిక్సీలో కాస్త బరకగా పొడి చేసుకుని
ఉంచుకోవాలి. ఏ కూరగాయలైనా (వంకాయ, దొండకాయ, బీరకాయ,
బెండకాయ,) ముక్కలుగా కోసి నూనెలో వేపి ఈ పొడి తగినంత చల్లి
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరి.

రవ్వ దోసె

బొంబాయిరవ్వ 1/4 kg
శనగపిండి 1/4 kg
బియ్యం పిండి 1/4 kg
మజ్జిగ 1/2 కప్పు
పచ్చిమిరపకాయలు 3
జీలకర్ర 1 tsp
కొత్తిమిర 1 tsp
ఉప్పు తగినంత

రవ్వ,శనగపిండి, బియ్యంపిండి మజ్జిగలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపి, 
అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు,జీలకర్ర కొత్తిమిర కలిపి కనీసం 
అరగంట నానపెట్టి గరిటజారుగా కలుపుకుని పలుచగా దోసెలాగా పోసుకుని ఎర్రగా 
కాల్చి చట్నీతో తీసుకుంటే రుచిగా వుంటాయి.

పేపర్ దోసె

పేపర్ దోసె



మినప్ప్పప్పు 1/2 కప్పు
బియ్యం 4 కప్పులు
ఉప్పు తగినంత
జీలకర్ర 1 tsp
నూనె 1/2 కప్పు


మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటలపాటు నానబెట్టాలి.తరువాత
విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు
మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను
ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా
ఉండేలా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చేవరకు కాల్చి
చట్నీ, సాంభార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.

గోల్డెన్ దోసె

బియ్యం - నాలుగు కప్పులు
మెంతులు - అర టీ స్పూన్
పెసరపప్పు - అర కప్పు
మినపప్పు - ఒక కప్పు
శనగపప్పు - అర కప్పు

పప్పులు, బియ్యం కలిపి కడిగి మెంతులు వేసి కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
తరువాత మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలన్నా అలా ఉంచాలి. తగినంత ఉప్పు వేసి 
కలిపి పలుచగా దోసెలు వేయాలి. కరకరలాడే దోసె రెడీ.

వడ


మినప్పప్పు 200 gms
పచ్చిమిర్చి 6
అల్లం 1 " ముక్క
కరివేపాకు 1 రెబ్బ
ఉప్పు తగినంత
నూనె - వేయించడానికి

ముందుగా మినప్పప్పును శుభ్రం చేసి నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత వడగట్టి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా కాటుకలా గ్రైండ్ చేసుకోవాలి. ఉన్నా తడి సరిపోతుంది. నీళ్లు పోస్తే పిండి పలుచబడుతుంది. చివర్లో తగినంత ఉప్పు, సనంగా తరిగిన కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసి పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని తడి చేత్తో ప్లాస్టిక్ కాగితంపైన లేదా అరిటాకుపైన వేదలుపుగా వత్తుకుని మధ్యలో వేలితోనే చిల్లు పెట్టి నూనె లో వేసి బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించి తీసేయాలి. వీటిని కొబ్బరి చట్నీ, సాంబార్ తో వడ్డించండి.

క్యాబేజీ వడ


మినప్పప్పు 250 gms
క్యాబేజీ 100 gms
జీలకర్ర 1 tsp
కరివేపాకు 2 tsp
అల్లం 1 " ముక్క
కొత్తిమిర 1/4 కప్పు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి

మినప్పప్పును నాలుగైదు గంటలు నానబెట్టి నీరంతా ఒడ్చేయాలి. ఇందులో అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన క్యాబేజీ (పచ్చిగా లేదా వేడినీళ్ళలో వేసి తీసినా సరే ) , కరివేపాకు, కొత్తిమిర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. నూనె వేడి చేసి ఈ మిశ్రమాని వడలుగా వత్తుకుని ఎర్రగా అయ్యేవరకు నిదానంగా కాల్చాలి. టమాటో లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.

పులగం


బియ్యం 250 gms
పెసరపప్పు 100 gms
పచ్చిమిర్చి 6
ఆవాలు 1/4 gms
జీలకర్ర 1/4 gms
అల్లం చిన్న ముక్క
కొత్తిమిర 1/2 కట్ట
జీడిపప్పు 10
మిరియాలు 8
నెయ్యి 4 tbsp
నూనె 2 tsp
ఉప్పు తగినంత

బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి అరగంట నీటిలో నానబెట్టాలి. వెడల్పటి గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళు పోసి మరిగించాలి. తర్వాత బియ్యం, పప్పు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.రంగు కావాలంటే పావు టీస్పూను పసుపు వేసుకోవచ్చు. అడుగంటకుండా కలుపుతూ మొత్తం ఉడికాక కొత్తిమిర కలిపి దింపేయాలి.

దిబ్బరొట్టె

మినప్పప్పు 250 gm
బియ్యపురవ్వ 150 gm
ఉప్పు సరిపడ
నూనె 1/2 cup

మినప్పప్పును శుభ్రం చేసుకున్న తరువాత మూడు గంటలపాటు నానబెట్టి
మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకూడదు. రుబ్బిన ముద్దలో
బియ్యపు రవ్వను కలిపి తగినంత ఉప్పు కూడా కలిపి అవసరమనుకుంటే
కొద్దిగా నీరు కలుపుకోవాలి.మందపాటి బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువ వేసి
అట్టు పోసుకోవాలి. తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిని
వేరుశనగపప్పు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. బ్రెడ్ ఎలా ఉంటుందో
దిబ్బరొట్టె అంత మందంగా ఉంటుంది.

పుల్లట్టు

బియ్యపు పిండి 250 gm
మైదా 100 gm
గడ్డపెరుగు 100 gm
జీలకర్ర 1 tsp
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 gm
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp

గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ
ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,
మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
నాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీద 
కాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన పరిమాణములో పోసుకొని నెయ్యితో 
కాల్చుకోవాలి. పిండి ఎంత పులిస్తే అంత రుచిగా ఉంటుంది.

రాగి అట్టు


మినప్పప్పు 100 gm
బియ్యపు పిండి 75 gm
రాగిపిండి 200 gm
పచ్చిమిరపకాయలు 4
నెయ్యి అర కప్పు
ఉప్పు తగినంత

మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు,
బియ్యపు పిండి, రాగిపిండి అన్నీ కలుపుకొని ఒక రాత్రంతా పిండిని పులవనివ్వాలి.
తెల్లవారి వేడి పెనం మీద దీనిని కొద్దిగా మందంగా అట్టు పోసుకోవాలి. ఒక వైపు 
ఎర్రగా కాల్చి రెండవవైపు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా 
కాల్చుకోవాలి. దీనికి కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్.

Friday, July 24, 2015

కుష్బూ ఇడ్లీ

కుష్బూ ఇడ్లీ
కావలసిన పదార్థాలు:
ముడి బియ్యం - రెండు కప్పులు, మినపప్పు - అర కప్పు, సగ్గుబియ్యం - పావు కప్పు, ఉప్పు - తగినంత, వంట సోడా - పావు టీస్పూన్‌
తయారీ:
ముడిబియ్యం, మినపప్పు, సగ్గుబియ్యంలను శుభ్రంగా కడిగి పది గంటలు నానబెట్టాలి. వాటన్నింటినీ కలిపి ఇడ్లీ పిండిలా రుబ్బాలి. ఈ పిండి కనీసం పదిగంటల సేపైనా పులవలి. అంటే ముడిబియ్యం, మినపప్పు, సగ్గుబియ్యాలను ఉదయం నానబెట్టాలి. సాయంత్రం పిండి పట్టి మరుసటిరోజు ఇడ్లీల్లా వేసుకోవాలన్నమాట. అచ్చం మామూలు ఇడ్లీకి మల్లే. పిండిలో కొంచెం వంట సోడా కలిపి ఇడ్లీ ప్లేట్లలో వేసి ఉడికించాలి. సాంబారుతో కలిపి వీటిని తింటే చాలా బాగుంటాయి.

ఇడ్లీ బర్గర్‌

ఇడ్లీ బర్గర్‌
కావలసినవి:
ఇడ్లీలు- ఆరు, పుదీనా చట్నీ- 4 టీస్పూన్లు, టమాటా (తరిగి)- మూడు, ఉల్లిపాయ (తరిగి)- మూడు, క్యారెట్‌ తురుము- ఒక కప్పు, పచ్చి బటానీలు- ఒక కప్పు, మైదా - ఒక టీస్పూను, పసుపు తగినంత, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఒక్కోటి అరటీస్పూన్‌ చొప్పున, కొత్తిమీర తరుగు-తగినంత, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడినంత.
తయారీ:
కడాయిలో నూనె వేడి చేసి ఇడ్లీలని గోధుమరంగు వచ్చే వరకు వేగించాలి. అవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేట్టు జాగ్రత్తపడాలి. కొత్తిమీర, పుదీనా చట్నీలను ఇడ్లీలకు రెండు వైపులా పూయాలి. క్యారెట్‌, పచ్చి బటానీలను ఉడికించి వడకట్టాలి. దోరగా వేగించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన క్యారెట్‌, బటానీలు, ఉప్పు, కొత్తిమీర వేసి జారుగా కాకుండా గారెల పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్లెట్‌లా చేయాలి. ఇవి ఇడ్లీ సైజ్‌లో ఉండాలి. వీటిని గోధుమ రంగు వచ్చే వరకు నూనెలో వేగించాలి. ఆ తరువాత కట్లెట్‌ని మధ్యలో పెట్టి రెండు వైపులా ఉల్లిపాయ, టొమాటో ముక్కలు ఉంచి వాటిపై ఇడ్లీని పెట్టి తినేయాలి.

ఫ్రైడ్‌ చిల్లీ ఇడ్లీ

ఫ్రైడ్‌ చిల్లీ ఇడ్లీ
కావలసినవి:
ఇడ్లీలు - ఆరు, ఉల్లిపాయలు (తరిగి)- రెండు, టొమాటోలు(తరిగి) - మూడు, వెల్లుల్లి రెబ్బలు (నలిపి)- ఆరు, కరివేపాకు-కొద్దిగా, టొమాటో సాస్‌ - నాలుగు టేబుల్‌స్పూన్లు, కారం, పసుపు -ఒక్కో టీస్పూన్‌ చొప్పున, పచ్చి మిరపకాయలు(నిలువుగా చీల్చి) - ఆరు, నూనె- వేయించడానికి సరిపడినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా, మైదా - ఒక కప్పు, మొక్కజొన్నపిండి- ఒక టేబుల్‌స్పూన్‌, మిరియాల పొడి- ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు-తగినంత
తయారీ:
ఇడ్లీలని ఒకే సైజులో కొంచెం పెద్ద ముక్కలుగా కోయాలి. మైదా, కార్న్‌ఫ్లోర్‌, మిరియాల పొడి, ఉప్పు తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి కలపాలి. ఈ పిండిలో ఇడ్లీ ముక్కలను ముంచి నూనెలో గోధుమరంగు వచ్చేవరకు వేగించాలి. వేరొక కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె పోసి కరివేపాకు, వెల్లుల్లిలను వేగించాలి. తరువాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మూడు నిమిషాలపాటు వేగిన తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తరువాత టొమాటో సాస్‌ వేసి, నూనె తేలేవరకూ ఉడికించాలి. తరువాత దానిలో కారం, పసుపు, ఉప్పు, ఫ్రై చేసిన ఇడ్లీలు వేసి, రెండు నుంచి మూడు నిమిషాలపాలు ఉడికించాలి. తరువాత కొత్తిమీరతో అలంకరించి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

Thursday, July 23, 2015

కోఫ్తా మసాలా కర్రీ

కోఫ్తా మసాలా కర్రీ

• కోఫ్తాల కోసం కావాల్సినవి ...

అరటికాయలు - మూడు, బంగాళాదుంపలు - రెండు, శెనగపిండి - పావుకప్పు, ఉప్పు - తగినంత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు - రెండు చెంచాలు, బ్రెడ్‌పొడి - పావుకప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు - పావుకప్పు, నూనె - వేయించడానికి సరిపడా, జీలకర్ర పొడి, ధనియాల పొడి - చెంచా చొప్పున.

• గ్రేవీ కోసం కావాల్సినవి ....

యాలకులు - నాలుగు, లవంగాలు - నాలుగు, దాల్చినచెక్క - రెండు ముక్కలు, పసుపు - అరచెంచా, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు చెంచాలు, టమాటా ముక్కలు - పావుకప్పు, కారం - పావుచెంచా, ఉప్పు - తగినంత, గరంమసాలా పొడి - చెంచా, గిలకొట్టిన చిక్కటి పెరుగు - రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు - పావుకప్పు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు.

• తయారీ

ముందు కోఫ్తాలను తయారు చేసుకోవాలి. అరటికాయ, బంగాళాదుంపల చెక్కు తీసేసి కాస్త పెద్ద ముక్కల్లా కోయాలి. వాటిని ఓ గిన్నెలోకి తీసుకుని సరిపడా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. వేడి చల్లారాక ఆ నీటిని వంపేసి ముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నూనె తప్ప కోఫ్తాల కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి అందులో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క ముక్కలు, ఉల్లిపాయముక్కలు వేసేయాలి. ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్టు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మంట తగ్గించాలి. రెండు నిమిషాల తరవాత టమాటా ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చల్లాలి. కాసేపటికి టమాటా ముక్కలు కూడా మగ్గి నూనె పైకి తేలుతుంది. అప్పుడు గిలకొట్టిన పెరుగు, కాసిని నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. గ్రేవీ అంతా తయారయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న కోఫ్తాలూ, గరంమసాలా వేసి బాగా కలిపి, కొత్తిమీర చల్లి దింపేయాలి. 

చుడువా

చుడువా
• కావాల్సినవి
ఓట్స్ - కప్పు, అటుకులు - అరకప్పు, జీడిపప్పు, బాదం పలుకులు - పది, ఎండుమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, ఇంగువ - కొద్దిగా, పసుపు - పావుచెంచా, కరివేపాకు రెబ్బలు - రెండు మూడు, చక్కెర - చెంచా, కారం - కొద్దిగా, చాట్‌మసాలా - కొద్దిగా, ధనియాలపొడి - అరచెంచా. .
• తయారీ
బాణలిలో నూనె లేకుండా ఓట్స్‌ని వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే అటుకుల్ని కూడా వేయించుకుని అందులోకి తీసుకోవాలి. అదే బాణలిలో జీడిపప్పు, బాదం పలుకులు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేయించుకుని ఓట్స్, అటుకులపై వేయాలి. తర్వాత ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు, కారం, చాట్‌మసాలా, ధనియాలపొడి, చక్కెర వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. 

Sunday, July 19, 2015

గోరుచిక్కుడు 65

గోరుచిక్కుడు 65
కావలసినవి
గోరుచిక్కుళ్లు: పావుకిలో, కార్న్‌ఫ్లోర్: 50 గ్రా., మైదా: 50 గ్రా., చిల్లీసాస్: టీస్పూను, వెల్లుల్లి తురుము: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: అరటీస్పూను, నూనె: 5 టీస్పూన్లు, బేకింగ్‌పౌడర్: చిటికెడు, మిఠాయిరంగు: చిటికెడు
తయారుచేసే విధానం
• కాయల్ని శుభ్రంగా కడిగి అంచులు కోసి తడి లేకుండా తుడవాలి.
• ఇప్పుడు ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, వెల్లుల్లితురుము, ఉప్పు, కారం, బేకింగ్‌పౌడర్, మిఠాయిరంగు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. అందులోనే నూనె, చిల్లీసాస్ కూడా వేసి కలిపి 20 నిమిషాలు పక్కన ఉంచాలి.
• బాణలిలో నూనె పోసి కాగాక ఒక్కో గోరుచిక్కుడునీ అందులో ముంచి నూనెలో వేయించి తీయాలి. వీటిని ఏదైనా సాస్‌తో తింటే బాగుంటాయి.

గోరుచిక్కుళ్ల కడి

గోరుచిక్కుళ్ల కడి
కావలసినవి
గోరుచిక్కుళ్లు: పావుకిలో, సెనగపిండి: 50 గ్రా., అల్లంతురుము: టీస్పూను, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, చింతపండు గుజ్జు: 2 టేబుల్‌స్పూన్లు, కారం: అరటీస్పూను, దనియాలపొడి: టీస్పూను, ఆవాలు: అరటీస్పూను, ఎండుమిర్చి: రెండు, పసుపు: పావుటీస్పూను, ఇంగువ: పావుటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, ఉప్పు: తగినంత, నూనె: 4 టీస్పూన్లు
తయారుచేసే విధానం
• గోరుచిక్కుళ్లను శుభ్రంగా కడిగి అంచులు తీసేసి ముక్కలుగా కోయాలి.
• బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేసి అల్లంతురుము, పచ్చిమిర్చి తురుము వేసి వేయించాలి. అందులోనే సెనగపిండి కూడా వేసి వేగాక, కారం, దనియాలపొడి వేసి కలపాలి. అందులోనే రెండు గ్లాసుల నీళ్లు పోసి పిండిని ఉండలు కట్టకుండా కలపాలి. అందులోనే గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తరవాత టొమాటోముక్కలు, చింతపండుగుజ్జు, ఉప్పు వేసి మరికాసేపు ఉడికిం చాలి. దించే ముందు తాలింపు వేస్తే సరి.

Thursday, July 16, 2015

ఉలవచారు.

ఉలవచారు.

చిరుధాన్యాలతో తయారు చేసే వంటలు ఎప్పుడు ప్రత్యేకమైన సైడ్ డిష్ లుగా ఇండియన్ మీల్స్ ను పూర్తి చేస్తాయి. చిరుధాన్యాలు అధిక న్యూట్రీషనల్ విలువను కలిగి ఉంటాయి. ఇటువంటి చిరుధాన్యాలను పురుషులు ప్రతి రోజూ తినడం వల్ల చాలా ఆరోగ్యకరం అని మెన్ న్యూట్రీషినిస్టులు కూడా వ్యక్తం చేశారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుతాయి. వీటిలో అధిక ప్రోటీనులతో పాటు మంచి డైయటేరియన్ ఫైబర్, మినిరల్స్, మరియు విటమిన్ బి1వంటివి పుష్కలంగా ఉంటాయి.

చిరు ధాన్యాలు (ఉలవలు) ఉపయోగించి ఫ్రై మరియు చారు, పులుసు వంటి వంటకాలను తయారు చేస్తుంటారు. చిరు ధాన్యాలు చాలా గట్టిగా ఉండటం వల్ల వీటిని రాత్రంతా నానబెట్టాల్సి వస్తుంది. ఉలవలతో తయారు చేసు పులుసు ఒక మంచి సైడ్ డిష్ గా ఉంటుంది. ప్లెయిన్ రైస్ కు అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. మరి ఉలవచారు ఎలా తయారు చేస్తారో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:
ఉలవలు: 2cup
టమోటాలు: 4
చింతపండు రసం: 2btsp
ఉల్లిపాయలు: 2
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
పచ్చిమిర్చి : 3(మద్యకు కట్ చేసుకోవాలి)
ఎండు మిర్చి: 3
అల్లంపేస్ట్: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
ధనియాలపొడి: 1tsp
కొత్తిమీర: కొద్దిగా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉలవలను ముందు రోజు నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే ఆ నీరు తీసి మళ్లీ నీళ్లుపోసి కుక్కర్‌లో ఉడికించాలి. బాగా ఉడికిన ఉలవలను మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఓ పాన్‌ లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కట్‌చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పేస్ట్ కూడా వేసి వేగేదాకా ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అందులో టమోటాలు వేసి ఫ్రై చేయాలి. మూడు నిమిషాల తరువాత కొద్దిగా కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల ముద్దను వేసి, చింతపండు రసం పోసి మరిగించాలి. దించేముందు ధనియాలపొడి, కొత్తిమీర తరుగు వేయాలి. ఈ ఉలవచారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.