Thursday, November 14, 2013

ఉసిరి

కార్తీకంలో ఉసిరిని తప్పకుండా తినాలంటారు.
ఉసిరి ఇంటికి సిరిసంపదలు తీసుకొస్తుందంటారు.
ఉసిరిని అరచేతిలో ఉంచుకుంటే చాలు ఆరోగ్యం వరిస్తుందంటారు.
సరిలేని గొప్పదనం ఉసిరిది!
కార్తీకం స్పెషల్‌గా ఉసిరి వంటలు ఆరగించండి, ఆనందించండి...
ఉసిరి రైస్
కావలసినవి:
బియ్యం - పావు కేజీ
ఉసిరికాయలు - పది
పసుపు - టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
నువ్వులపొడి - 2 టీ స్పూన్లు
జీడిపప్పు - 4 టీ స్పూన్లు
ఎండుమిర్చి - 4
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కట్ట
శనగపప్పు - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
తయారి:
అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. బాణలిలో నూనె కాగిన తరువాత పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగుతుండగా పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. తరవాత దీనిని ఆరబెట్టిన అన్నంలో కలుపుకోవాలి.
ఉసిరి పచ్చడి
కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
పసుపు - టీ స్పూను
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 5
ఎండుమిర్చి - 5
కొత్తిమీర - ఒక కట్ట
ఇంగువ - పావు టీ స్పూను
నిమ్మకాయ - సగం చెక్క
ఆవాలు - టీ స్పూను
మెంతులు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను, నూనె - తగినంత
తయారి:
ముందుగా ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి. తరిగేటప్పుడు గింజలు తీసేయాలి. అందులో పసుపు వేసి బాగా కలిపి రెండు రోజులు గట్టి మూత ఉన్న సీసాలో ఉంచేయాలి. మూడవ రోజు వాటిని తీసి మెత్తగా చేసి అందులో ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె కాగిన తరవాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించి, చల్లారాక గ్రైండ్ చేయాలి. ఉసిరిముద్దలో ఈ పొడి, నిమ్మరసం, ఇంగువ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఉసిరి జామ్
కావలసినవి:
ఉసిరికాయలు - 100 గ్రా., పంచదార - 50 గ్రా., నూనె - వేయించుకోవడానికి తగినంత, నిమ్మరసం - టీ స్పూను, జీడిపప్పు - 10 గ్రా., బాదంపప్పులు - 10 గ్రా., కిస్‌మిస్ - 10 గ్రా.
తయారి:
ముందుగా ఉసిరికాయలను దోరగా వేయించుకుని చల్లారిన తరువాత గింజలు తీసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి తీగపాకం పట్టాలి. అది కొంచెం దగ్గర పడ్డాక ఉసిరి పేస్ట్ వేసి గట్టిపడేవరకు కలుపుతూ ఉండాలి. తరువాత నిమ్మరసం వేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.
ఉసిరికాయపప్పు
కావలసినవి:
కందిపప్పు - 100 గ్రా.
ఉసిరికాయలు - 10, నూనె - తగినంత
పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 2
ఎండుమిర్చి - 4
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - రెండు రెమ్మలు
తయారి:
ముందుగా ఉసిరికాయలను ముక్కలు చేసుకోవాలి. కందిపప్పు, ఉసిరిముక్కలను విడివిడిగా ఉడకబెట్టాలి. బాణలిలో నూనె వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తరవాత పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న ఉసిరిముక్కలను అందులో వేసి ఒకసారి దోరగా వేయించాలి. చివరగా ఉడికించుకున్న పప్పు, ఉప్పులను అందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఉసిరి ఆవకాయ
కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
కారం - 50 గ్రా.
ఆవపిండి - 50 గ్రా.
ఉప్పు - తగినంత
పల్లీ నూనె లేదా పప్పు నూనె - 100 గ్రా.
నిమ్మరసం - మూడు టీ స్పూన్లు
తయారి:
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి పోయేవరకు ఆరనివ్వాలి. తరవాత వాటికి చిన్నగా గాట్లు పెట్టాలి. స్టౌ మీద బాణలిలో నూనె సన్న సెగ మీద కాగిన తరవాత ఈ ఉసిరికాయలను అందులో వేసి మెత్తబడేవరకు వేయించాలి. తరవాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తరవాత అందులో కారం, ఆవపిండి, ఉప్పు, నిమ్మరసం వేయాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె కాగిన తరవాత అందులో ఇంగువ వేసి దింపి, చల్లారిన తరవాత పచ్చడిలో పోసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక రోజు ఊరిన తరవాత తింటే బావుంటుంది.
మెంతి ఉసిరి
కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
మెంతులు - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
ఎండుమిర్చి - 50 గ్రా.
మినప్పప్పు - రెండు టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు

తయారి:
ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. గింజలు తీసేయాలి. తరువాత స్టౌమీద బాణలిలో నూనె వేడయ్యాక ఎండుమిర్చి, మెంతులు, మినప్పప్పు, పసుపు, ఇంగువ వేసి వేయించిన తరువాత చల్లార్చి పొడి చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఉసిరిముక్కలలో కలపాలి. బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించి ఇందులో కలపాలి. చివరగా ఉప్పు వేసి మరోమారు కలిపితే మెంతి ఉసిరి బద్దలు తయారయినట్లే.



0 comments:

Post a Comment