Wednesday, November 27, 2013

గ్రీన్ బీన్స్... పచ్చిబఠాణి, క్యారెట్‌లతో

కావలసిన పదార్థాలు: బీన్స్ - పావుకేజీ, క్యారెట్స్ - వందగ్రాములు, పచ్చిబఠాణి - వంద గ్రాములు, పచ్చిమిర్చి - 2, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, నూనె - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, కరివేపాకు - 4 రెబ్బలు, (తాలింపుకోసం) మినప్పప్పు + ఆవాలు + జీలకర్ర - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, పచ్చికొబ్బరి కోరు - అరకప్పు.

తయారుచేసే విధానం: బీన్స్, క్యారెట్ సన్నని ముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగించాలి. తర్వాత బీన్స్, క్యారెట్ తరుగు, పచ్చిబఠాణి కూడా వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఉప్పు, మిరియాలపొడి వేసి రెండు నిమిషాల తర్వాత కొబ్బరికోరు, కొత్తిమీర తరుగు కలిపి దించేయాలి. ఈ కూర పరాటాల్లో చాల బాగుంటుంది.
గ్రీన్ బీన్స్... చిన్న మెంతికూరతో
కావలసిన పదార్థాలు:బీన్స్ - పావుకేజీ, చిన్నమెంతికూర తరుగు - అర కప్పు, అల్లం తరుగు -1 టీ స్పూను, పచ్చిమిర్చి (నిలువుగా తరగాలి) - 2, కారం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2 టీ స్పూన్లు. గరం మసాల - అర టీ స్పూను.

తయారుచేసే విధానం:బీన్స్‌ని సన్నని ముక్కలుగా తరిగి, ఒక కప్పు నీటిలో 5 నిమిషాలు ఉడికించి వార్చేయాలి. కడాయిలో నూనె వేసి అల్లం, కరివేపాకు, మిర్చి, మెంతికూర తరుగు వేగించాలి. తర్వాత ఉప్పు, కారం, ఉడికించిన బీన్స్ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటేసి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచాలి. మసాలపొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. ఈ కూర మెంతి సువాసనతో ఉండి, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

గ్రీన్ బీన్స్... నువ్వులతో

కావలసిన పదార్థాలు:బీన్స్ - పావుకేజీ, వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, వేగించిన నువ్వులు - వందగ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, మసాలపొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం:బీన్స్‌ని కట్ చేయకుండా తొడిమల్ని , ఈనెల్ని తీసి ఉప్పు కలిపిన నీటిలో కొద్దిసేపు (హాఫ్ బాయిల్) ఉడికించి, నీరు ఓడ్చి ఆరబెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి వెల్లుల్లి పేస్టు వేగించి సగం ఉడికిన బీన్స్‌ని వేసి సన్నని మంటపై మూతపెట్టి మగ్గనివ్వాలి. ముప్పావుభాగం వేగాక (మరికొద్ది) ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. తర్వాత నువ్వులు వేసి మూతపెట్టి రెండు నిమిషాలయ్యాక మసాలపొడి చల్లి దించేయాలి. బీన్స్‌నువ్వుల వేపుడు అన్నంతో నంజుకున్నా, కలుపుకున్నా చాలా రుచిగా ఉంటుంది.

0 comments:

Post a Comment