Tuesday, November 10, 2015

వెజిటబుల్స్ ఊతప్పాలు

కావలసిన పదార్థాలు:

దోసల పిండి
కాస్త పులిసిన పెరుగు
సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు
తురిమిన క్యారెట్
సన్నగా తరిగిన ఉల్లిపాయలు
సన్నగా తరిగిన క్యాప్సికం
సన్నగా తరిగిన టమాటో

తయారు చేసే విధానం:

ముందుగా పెరుగును బాగా చెంచాతో కలియబెట్టండి. చిక్కగా కావాలి. దీనిని దోసెల పిండిలో కలపండి. మొత్తం మీద పిండి ఎక్కువ పలుచగా ఉండకూడదు. ఈ పిండిని ఒక గంట-రెండు గంటలు (ఋతువును బట్టి, ఎండాకాలం అయితే కాసేపు చాలు, శీతాకాలం కాస్త ఎక్కువ సమయం పడుతుంది) సేపు అలా ఫ్రిజ్ బయట ఉంచండి. పెరుగు-పిండి మిశ్రమం కొంచెం పులిసి పొంగినట్లు అవుతుంది.

పొయ్యి మీద పెనం పెట్టి శుభ్రంగా నూనెతో పెనం అంతా ఒక తలకోసిన బంగాళ దుంప లేదా ఉల్లిపాయతోనో రుద్దండి. నూనె పెనం అంతా సమతుల్యంగా వ్యాపిస్తుంది. దానిపై నాలుగు అంగుళాల వ్యాసంలో పిండిని వేసుకోండి. ఉల్లిపాయ-పచ్చిమిరపకాయల ముక్కలను దానిపై చల్లండి. మొత్తం ఊతప్పం మీద అర చెంచా నూనె వేయండి. ఊతప్పం తిప్పటానికి సిద్ధంగా ఉంది అనటానికి సంకేతం పిండిలోని పచ్చి పోయి చిల్లులుగా ఏర్పడి ఆవిరి వస్తుంది. అప్పుడు దానిని తిరగవేసి అట్లకాడతో అద్దుతూ ఒక రెండు నిమిషాలు ఉంచండి. కిందవైపు కూడా పిండి ఉడికి ఉల్లిపాయ-పచ్చిమిరపకాయ ముక్కలు రంగు మారుతున్నప్పుడు తీసి ఒక ప్లేటులో వేసుకోండి. ఇలాగే రెండో ఊతప్పంపై క్యాప్సికం-పచ్చిమిరప, మూడో ఊతప్పంపై క్యారెట్-పచ్చిమిరప వేసుకోండి. నాలుగో ఊతప్పం టమాటోత్-పచ్చిమిరపతో వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. టమాటోలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త నూనె ఎక్కువ వేసుకొని విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పాలి. టమాటోలు కూడా బాగా రంగుమారి నీరు ఇంకేంతవరకు ఉంచాలి. ఈ టమాటో ఊతప్పాన్ని సన్న సెగలో చేసుకుంటే మాడ కుండా ఉంటుంది.

ఈ నాలు రకాల ఊతప్పలను వేరుశనగపచ్చడి, కారప్పొడి, సాంబార్ లేదా తాజా కూరగాయ చట్నీ దేనితోనైనా తినవచ్చు. వేడి వేడిగా తినాలి. నూనె లేకుండా కూడా ఇవి చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా, చాకచక్యంగా తిరగవేయాలి, శ్రద్ధగా గమనించాలి.

0 comments:

Post a Comment