Monday, November 9, 2015

ఉల్లిపాయ మజ్జిగ పులుసు:

 చిక్కగా కావాలనుకున్న వాళ్లు మరింత బియ్యప్పిండి-శనగపిండి మిశ్రమం, కొబ్బరి వేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
పెరుగు (పావులీటరు పాలు కాచి తోడుపెట్టినవి) - కొద్దిగా పులిస్తేనే రుచి.
ఒక అర స్పూను మెంతులు, స్పూను ధనియాలు, స్పూను జీలకర్ర
రెండు స్పూన్ల శనగపిండి, రెండు స్పూన్ల బియ్యప్పిండి
కొబ్బరి 7-8 ముక్కలు
ఒక టమాటో (కోసిన ముక్కలు)
రెండు పచ్చిమిరప కాయలు, కాస్త తురిమిన అల్లం
కరివేపాకు, కొత్తిమీర
తగినంత ఉప్పు, పసుపు, పోపుకు నూనె, ఆవాలు, ఇంగువ
తయారు చేసే విధానం:
ముందుగా మెంతులు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరిని వేయించి మెత్తగా డ్రై గ్రైండర్లో మిక్సీ వేయాలి. కొబ్బరి మెత్తగా నలిగిపోవాలి. తరువాత టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, పెరుగు, శనగపిండి, బియ్యప్పిండి, పెరుగు వేసి వెట్ గ్రైండర్లో మిక్సీ వేయాలి. అన్నీ కలిసి చక్కగా, చిక్కని మిశ్రమం కావాలి. పలుకులు ఉండకూడదు.
ఉల్లిపాయలను నిలువుగా పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పాత్రలో నూనె కాస్త వేసి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత అందులో కరివేపాకు వేసి, ఒక నిమిషం తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి రంగు మారి మెత్త బడే వరకు వేయించాలి. తరువాత మిక్సీలో వేసుకున్న మజ్జిగపులుసు మిశ్రమాన్ని వేయాలి. ఒక పెద్దగ్లాసు నీళ్లు, తగినంత ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. దించేముందు కొత్తిమీర తరిగి వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసు తింటే భలే. నంజుకోవడానికి బూడిద గుమ్మడి లేదా మినప వడియాలు, ఊరు మిరపకాయలు ఉంటే అద్భుతః.
ఉల్లిపాయల బదులు మంచి గుమ్మడి/బూడిద గుమ్మడి/సొరకాయ/క్యారట్ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు.

0 comments:

Post a Comment