Wednesday, September 30, 2015

గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్

ఎప్పుడూ బంగాళాదుంప లేద మిరపకాయ బజ్జీలో తిని విసుగ్గా ఉందా? అయితే ఈసారి గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్ వండి తినండి. మీకు నచ్చుతుంది.

కావలసిన పదార్థాలు: 

1. బేబీ కార్న్ (లేత మొక్క జొన్న - 3-4 అంగుళాల పొడవు ఒక సెంటిమీటెర్ వ్యాసం ఉంటాయి) 
2. తగినంత శనగపిండి, కాస్త బియ్యప్పిండి
3. మీకు బాగా కరకరలాడేటాట్లు రావాలంటే వంట సోడా
4. తగినంత ఉప్పు,కారం
5. కాస్త జీలకర్ర
6. వేయించటానికి నూనె
7. టమాటో కెచప్ లేదా చిల్లీ సాస్ లేదా చింతపండు-ఖర్జూరాల చట్నీ

ముందుగా బేబీ కార్నులను నిలువుగా మధ్యలో కోసి వేడి నీటిలో ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్యకు కోయటం వలన లోపల కూడా కాస్త ఉడుకుతుంది. ముక్కలు ఒకింత మెత్తబడగానే తీసి పక్కన పెట్టుకోండి. రైసుకుక్కరులో ఆవిరిలో వండే వసతి ఉన్నవాళ్లు దానిలో కూడా ఒక 2 నిమిషాలు ఈ ముక్కలను ఉడికించుకోవచ్చు.

శనగపిండి-బియ్యప్పిండి కలిపి దానిలో ఉప్పు,కారం, జీలకర్ర, వంట సోడా వేసి నీళ్లు పోసి జారుగా పకోడీ పిండి కలుపుకోండి. పిండి గడ్డలు లేకుండా మెత్తగా చేతితో కానీ, మిక్సీలో కానీ నలుపుకోండి. బాణలిలో నూనె పోసి కాచుకోండి. వేడినీళ్లలో కాస్త ఉడికిన బేబీకార్నును ఈ పిండిలో వేసుకొని ఎక్కువ పిండి ముక్కకు పట్టకుండా గిన్న అంచులకు ముక్కను అద్ది వేడినూనెలో వేయండి. ఒక్కొక్క వాయి దాదాపు 1-2 నిమిషాలు వేగిన తరువాత ముక్కలు గోల్డెన్ రంగులోకి మారతాయి. వాటిని తీసి ఒక ప్లేటులో పాపరు టవల్లో వేసి ముక్కలకున్న నూనెను తుడుచుకొని ఒక గిన్నెలో బేబీకార్న్ వేసుకోండి. వీటిని వేడిగా టమాటో కెచప్ లేదా చిల్లీ సాస్ లేదా చింతపండు-ఖర్జూరాల చట్నీతో తినవచ్చు.

గమనిక - ఈ చిత్రం ఇంటర్నెట్ లోది. నేను చేసినప్పుడు చిత్రం తీయటం మర్చిపోయాను. సరదగా వీటిమధ్యలో టూత్ పిక్స్ గుచ్చి చేతులకు నూనె అంటకుండా తినవచ్చు.

0 comments:

Post a Comment