Wednesday, September 30, 2015

సజ్జ రొట్టె

సజ్జలు కూడా చిరు ధాన్యాలె ..మిల్లెట్స్ అన్నమాట . హిందీలో బాజ్రా అంటారు . ఇంగ్లిష్ లో పెర్ల్ మిల్లెట్ ( Pearl Millet ) అంటారు . సజ్జలలో కాల్షియం , ఐరన్ , ఫైబెర్ చాలా ఎక్కువగా ఉంటాయి . కొద్దిగా వేడిచేసే గుణం ఉంటుంది. రుచి చాలా బావుంటుంది . పంజాబీలు " బాజ్రేకీ రోటీ , సర్సొందా సాగ్ " అంటూ ..వాళ్లకి ఇష్టమైన కాంబినేషన్ చెప్తారు . అంటే సజ్జరోట్టే , ఆవాల ఆకు తో చేసే కూర .. చాలా బావుంటుంది . అయితే వాళ్ళు చేసినంత పల్చటి రొట్టె కాకపోయినా .. కొద్దిగా నూనె , ఇతర పదార్ధాలతో , తెలంగాణా " సద్ద రొట్టె " మా అమ్మ చేసేది . అదే నాకు చాలా ఇష్టం . ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను .
సజ్జలు సూపర్ మార్కెట్లో అయితే శుభ్రంగా ఉంటాయి . బయట మండీ లలో అయితే శుభ్రం చేసి , కడిగి ఎండబెట్టి పిండి పట్టించుకోవాలి . కావలసినంత పిండి ( పావు కిలో పిండికి , 3,4 రొట్టెలు అవుతాయి )
పిండి , వెడల్పైన బౌల్ లోకి తీసుకోవాలి . ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , కరివేపాకు , ఉప్పు
, కొత్తిమిర కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి . చిన్న లేత సొరకాయ ముక్క తురిమి పిండికి కలిపి , గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి , నీళ్ళతో ముద్దగా చేసుకోవాలి . చపాతి
పిండిలా గట్టిగా ఉండదు .. మృదువుగా ఉంటుంది పిండి . ఆపిండిని నాలుగు
సమాన భాగాలుగా ముద్ద చేసుకోవాలి .
ఒక్కొక్క ముద్ద బత్తాయి కాయ సైజ్ లో ఉంటుంది . ప్లాస్టిక్ పేపర్ , లేదా ఆయిల్ కవర్ కట్ చేసి , (లోపలివైపు వాడుకోవచ్చు )
దానికి కొద్దిగా నూనేరాసి సజ్జ పిండి ముద్ద రొట్టె లాగా వత్తుకోవాలి . మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే ఉండాలి . పెనం వేడి చేసి ఒకస్పూన్ నూనె వేసి రొట్టె వెయ్యాలి . కొద్దిగా కాలిన తరువాత రెండో వైపు తిప్పాలి . బాగా కాలిన తరువాత తీసెయ్యాలి .
దీనికి కాంబినేషన్ గా ఉల్లిపాయ కారం , వెన్న
/ పేరిన నెయ్యి వేసుకొని తినాలి .
ఉల్లిపాయలు రెండు , సరిపడా ఉప్పు , కారం . కొద్దిగా చింతపండు కలిపి కచ్చా , పచ్చాగా నూరెయ్యడమే ..

0 comments:

Post a Comment