Thursday, July 14, 2016

మెంతిగుండ

మెంతులు ఆరోగ్యానికి, షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచివని మనకు తెలిసిందే ! అయితే, చేదుగా ఉండటంవల్ల వాటిని పోపుల్లో తప్ప మరెక్కడా వాడము. అయితే వీటినే 'మెంతి గుండ' గా తయారుచేసి పెట్టుకుంటే, అనేకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అవి చెప్పే ముందు తయారీ విధానం చూద్దాము.
మెంతి గుండ
---------------
ఆవాలు - 4 స్పూన్లు
మెంతులు - 4 స్పూన్లు
ఎండుమిర్చి - 10-15
నూనె - ఒక స్పూన్
ముందుగా మూకుడులో నూనె వేసి, పైవన్నీ వేసేసి ఎర్రగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పొడి చేసి, ఆరాకా ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. నిజానికి మన పూర్వీకులు ఇళ్ళలో ఎప్పుడూ దీన్ని సిద్ధం చేసి ఉంచేవారు.
ఉపయోగాలు
------------------
౧.ఉప్పులో వేసిన లేక తాజా గోంగూర, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ, మెంతిబద్దలు(దీనికి మాత్రం మిక్సీ అక్కర్లేదు, చిన్నచిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వాడచ్చు), వంటి వాటికి క్రింది ఫార్ములా వాడెయ్యచ్చు.
మిక్సీలో మెత్తగా రుబ్బిన పచ్చడి + రెండు స్పూన్ల మెంతి గుండ + ఒక స్పూన్ కారం + తగినంత ఉప్పు - కలిపేసి, నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు వేసేస్తే, తాజా పచ్చళ్ళు తయారవుతాయి.
౨. దప్పళం, తోటకూర పులుసు, పులిహోర వంటివి కలిపేటప్పుడు ఒక చెంచా మెంతి గుండ వేస్తే, ఆ రుచే వేరు.
౩. అప్పటికప్పుడు ఇడ్లీ, దోశ లోకి పచ్చడి చెయ్యాలంటే - ఇలా ప్రయత్నించి చూడండి.
తరిగిన మామిడికాయ ముక్కలు + 2 స్పూన్ల మెంతి గుండ + రెండు చెంచాల బెల్లం పొడి + 2 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర - మిక్సీ తిప్పేసి, పోపేస్తే చక్కటి మామిడికాయ పచ్చడి తయారు. ఒకసారి రుచి చూస్తే, మరి వదలరండోయ్.

0 comments:

Post a Comment