Monday, October 14, 2013

కాకరకాయ.

గుత్తి కాకర:

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - నాలుగు, పల్లీలు - అర కప్పు, కొబ్బరి - అరకప్పు, ఎండు మిరపకాయలు - ఐదు, వెల్లుల్లి రేకలు - నాలుగు, ధనియాలు - ఒక టేబుల్ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 


తయారుచేయు విధానం:


పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి పల్లీలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకలు వేసి వేగించాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. మరో గిన్నెలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక కొబ్బరి తురుము వేసి ఎర్రగా వేగించాలి. చల్లారిన తర్వాత అందులో అర కప్పు పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కాకరకాయకి మధ్యలో గాటు పెట్టి విత్తనాలు తీసేసి అందులో ఈ కొబ్బరి మిశ్రమం కూరి నూనెలో వేగించాలి. 


చపాతి 


కావలసిన పదార్థాలు: 


కాకరకాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, గోధుమ పిండి - అరకిలో, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
కాకరకాయని పెద్ద ముక్కలు కోసి చింతపండు నీళ్లలో ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత వాటిని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో కొత్తిమీర తురుము, గోధుమ పిండి, కొద్దిగా నూనె, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత మనకి నచ్చిన సైజులో చపాతీలు చేసుకుని కాల్చుకోవాలి. చపాతీలు కొద్దిగా చేదుగా ఉన్నా...మధుమేహంతో బాధపడే వారికి ఈ చపాతీలు బాగా మేలు చేస్తాయి. 


కొబ్బరితో


కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - పావుకిలో, కొబ్బరి తురుము - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - ఐదు, వెల్లుల్లి రేకలు - ఐదు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - ఒక టీ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 


తయారుచేయు విధానం: 


కాకరకాయ ముక్కల్ని బాగా సన్నగా చక్రాలుగా కోసుకుని నాలుగు గంటలు ఎండలో ఆరబెట్టాలి. పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసి వేగించాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగాక ఉప్పు, పసుపు కొబ్బరి తురుము వేసి సన్ననిమంటపై వేగించి దించేయాలి. 


కాకర సబ్జీ


కావలసిన పదార్థాలు: కాకరకాయలు - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - నాలుగు, ఎండుమిరపకాయలు - మూడు, ధనియాలు - ఒక టేబుల్ స్పూను, శెనగపప్పు - పావు కప్పు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి రేకలు - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, చింతపండు - 20 గ్రాములు, పసుపు - కొద్దిగా - ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
ముందుగా ఎండుమిరపకాయలు, శెనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేగించుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయని పొట్టు తీసి చక్రాలుగా కోసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి ఒక పెద్దగ్లాసు చింతపండు నీళ్లు పోసి వేడెక్కాక అందులో కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. నీళ్లన్నీ పోయాక దించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి సన్ననిమంటపై మగ్గనివ్వాలి. దించేముందు శెనగపప్పు పొడి వేసి బాగా కలపి దించేయాలి. తీపిని ఇష్టపడేవారు శెనగపప్పు పొడి బదులు కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి. 


కాకర పకోడి


కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, మొక్కజొన్న పిండి - ఒక కప్పు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కారం పొడి - ఒక టీ స్పూను, వంట సోడా - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి సన్నటి చక్రాల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్నపిండి, ధనియాల పొడి, కారం, వంట సోడా, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. పిండి బాగా పలుచగా ఉండేలా కలపాలి. లేదంటే ముక్కపై పిండి ఎక్కవగా ఉండి కాకరకాయ ముక్కలు వేగకుండా పచ్చిగా ఉంటాయి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక కాకరకాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేయాలి. ముక్కపై పిండి పలుచగా ఉండడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి. వీటిని చారన్నంలో కాని సాంబారన్నంలో కాని నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment