Friday, August 30, 2013

పెసరపప్పు- నిమ్మకాయ



వేపుడు కూరలు ఎక్కువగా తిన్న తర్వాత వచ్చే ఇబ్బందులకు వంటకం మంచి హితవైనది. ఆకలి బాగా మందగించినప్పుడు లిక్విడ్ కూరను చేసుకోండి. 
కావలసిన పదార్ధాలు: 
పెసరపప్పు- పావు కిలో ఉల్లిపాయ- పెద్దది ఒకటి పచ్చి మిర్చి- రెండు ఉప్పు- తగినంత పసుపు- చిటికెడు పోపు సామగ్రి: ఎండు మిర్చి- 4 ఆవాలు- 1/2 టీ స్పూన్ మినపప్పు- 1 టీ స్పూన్ జీలకర్ర- 1/4 టీ స్పూన్ వెల్లుల్లి- 3 రేకలు కర్వేపాకు- కొద్దిగా కొత్తిమీర- కొద్దిగా నూనె- తగినంత నిమ్మకాయ- పెద్దది ఒకటి కూర 
చేసే విధానం: పెసర పప్పును మొదట దోరగా వేయించాలి. తగినంత నీరు పోసి ఉడికించాలి. రెండు పొంగులు వచ్చాక ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, పసుపు వేసి మెత్తగా ఉడికించి, ఉప్పు వేసి దించి మెత్తగా మెదిపి, బాణలిలో నూనె మరిగాక పైన చెప్పిన పోపు వేయించి పప్పులో కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. చివరిగా నిమ్మరం పిండి పప్పులో కలియబెట్టాలి. పప్పు కూరను గట్టిగా కాకుండా లూజుగా చేసుకోవడం బాగుంటుంది.

Friday, August 23, 2013

మసాలా కాకరకాయ



మసాలా కాకరకాయ కాకరకాయ అంటేనే చేదుకి నిదర్శనం అనుకుంటాంగానీ చేదులో ఉండే ఔషధ విలువలెన్నో...!డయాబెటిస్ వ్యాది తో బాధ పడే వారికోసం కాకరకాయ ఎంతో ముఖ్యమయిన ఔషదం. దీనిని ఇంగ్లీష్ లో "Bitter Gourd" అంటారు. షుగర్ లేదా డయాబెటిస్ వ్యాధి మరియు టాక్సిమియా వ్యాధి ఉన్నవారు దీని రసం ఒక గ్లాస్ తీసుకుని తాగినట్టయితే అది ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ తో సమానం. డాక్టర్స్ కూడా కాకరకాయ రసం తాగమని చెప్తారు. ఎటువంటి వ్యాధి లేని వారు కూడా మంచి షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంచుకోవటం కోసం మరియు ఆరోగ్యాన్ని బాగా చూస్కోవటం కోసం కాకరకాయని తిస్కోవాలి. ఇందులో ఐరన్ బాగా ఎక్కువగా ఉండటం వలన మరియు కేలోరిస్ తక్కువగా ఉండటం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రసం తాగటం కష్టమే అందువలన రకరకాల కూరలు చేసుకొని తినొచ్చు. మధుమేహ రోగులకు ఎంతో మేలు చేసే కాకరకాయతో ఎన్నో రకాల వంటలు చేసుకోచ్చు. అద్బుతమైన రుచిని తనివితీరా ఆస్వాదించవచ్చు
కావలసిన పదార్థాలు: కాకరకాయలు: 1/2kg చింతపండు: నిమ్మపండంత మెంతులు: 1tsp జీలకర్ర: 1tsp ఉల్లిపాయ: 2 టమోటో: 2 అల్లం ముక్క: చిన్నది వెల్లుల్లి రెబ్బలు: 4-8 నువ్వుల పొడి: 3tsp వేరుశెనగపప్పు పొడి: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా కారం: తగినంత ధనియా పొడి: 1tsp గరంమసాలా : చిటికెడు ఎండుకొబ్బరి తురుము: 1tbsp నూనె: 1/2cup 
తయారు చేయు విధానం: 1 ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, వాటికి నాలుగు గాట్లు పెట్టి, బౌల్లో నీళ్ళు పోసి అందులో వేసి కొద్దిగా ఉప్పు చేర్చి సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 2. అరగంట ముందే చింత పండును నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కాల్చి పెట్టుకోవాలి. 3. తర్వాత మిక్సీ జార్ లో ఎండుకొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి, కాల్చి పెట్టుకొన్న ఉల్లిపాయ, నువ్వులపొడి, ఉప్పు, కారం, ధనియాపొడి, వేరుశెనగ పప్పు, కొత్తిమీర నానబెట్టుకొన్న చింత పండు వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 3. ఇప్పుడు ముద్దుగా ఉడికించి పెట్టుకొన్న కాకరకాయల్లో మసాలా ముద్దను నింపాలి. 4. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే పసుపు కూడా వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత మసాలా ముద్ద నింపి పెట్టుకొన్న కాకరకాయల్ని వేసి వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చాక జీలకర్ర, మెంతి పొడి, నువ్వుల పొడి, గరం మసాలా వేసి బాగా కలియ తిప్పి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. అంతే మసాలా కాకరకాయ రెడీ.. వేడి వేడి అన్నం, రాగి ముద్ద లోని చాలా రుచికరంగా ఉంటుంది.

Monday, August 19, 2013

బ్రెడ్ సమోసా

వర్షాకాలంలో సాయంత్రపు చిరుజల్లుల్లో ప్రతి ఇంట్లోనూ వేడివేడిగా కాఫీతో పాటు, కారంగా ఏదైనా చిరుతిండ్లు చేసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. మన ఇండియాలో వర్షాకాలం అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. వర్షాకాలంలో ఇంట్లో వారందరూ ఒక చోట చేరి వేడి వేడి కాఫీ, ఛాట్స్ తీసుకుంటు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఛాట్స్ అంటే ముఖ్యంగా బజ్జీ, పకోడా..పకోడాలో వివిధ రకాలున్నాయి. అందులో ఉల్లిపాయ పకోడా లేదా ఆలూ పకోడ లేదా బ్రెడ్ పకోడా ఇలా వివిధ రకాలు వర్షాకాలంలో ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే చిరుతిండ్లు.
సాధారణ బ్రెడ్ తో తయారు చేసే వంటలు కడుపు నిండేట్లు చేస్తాయి. అందులో బ్రౌన్ బ్రెడ్ ఉపయోగించడం వల్ల లోఫ్యాట్ మరియు లోక్యాలరీలను కలిగి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. బ్రెడ్ తో తయారు చేసే వివిధ రకాల స్నాక్స్ లో బ్రెడ్ సమోస ఒకటి. బ్రెడ్ లో పీస్ మరియు పొటాటో మిశ్రమాన్ని స్టఫ్ చేసి డీఫ్ ఫ్రై చేస్తారు. చాలా రుచికరంగా ఉంటుంది. వర్షకాలంలో దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బంగాళదుంప మరియు గ్రీన్ పీస్ ను స్టఫ్ చేయడం వల్ల మరి రుచి, ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి మీరు ఈ కొత్త రుచిని టేస్ట్ చేయాలంటే ఒక సారి ప్రయత్నించండి..


కావలసిన పదార్థాలు: 


వైట్ బ్రెడ్: 8 (పెద్ద స్లైసులు, చివర్లు తీసేయాలి)
నూనె: 2btsp
ఉల్లితరుగు: 1/2cup
వెల్లుల్లి తరుగు: 1tsp
ఎండుమిర్చి: 3
పచ్చిమిర్చి తరుగు: 2tsp
బంగాళదుంప: 1 (పెద్దది, ఉడికించి, తొక్క తీసి, చిన్నచిన్నముక్కలుగా చేయాలి)
ఉడికించిన బఠాణీ: 50grms
ధనియాల పొడి: 2tsp
కొత్తిమీర తురుము: 2tbsp
డీప్ ఫ్రైకోసం నూనె: తగినంత'


తయారుచేయు విధానం: 


1. ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లితరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.

2. తర్వాత బంగాళదుంప ముక్కలు, బఠాణీ, ధనియాలపొడి వేసి బాగా మెత్తగా అయ్యేలా కలిపి, రెండు నిముషాలు ఉడికించాలి.
2. ఇప్పుడు కిందకు దించి ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తురుము వేసి కలపాలి.
3. తర్వాత బ్రెడ్ స్లైసులు ఫ్లాట్‌గా అయ్యేలా అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి.

4. ఉడికించుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, బ్రెడ్ పీస్ మీద ఉంచి పైన మరో పీస్ ఉంచి, అంచులను నీటితో తడుపుతూ అంతా మూసుకునేలా సమోసా ఆకారంలో జాగ్రత్తగా మూయాలి.
5. ఇలా అన్నింటినీ తయారు చేసుకొన్నతర్వాత స్టౌ మీద పాన్ ఉంచి నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి వేయించాలి .
6. బంగారురంగులోకి వచ్చాక తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి. తర్వాత నూనె అంత ఇమిరిపోయాక వేడి వేడిగా సర్వ్ చేయాలి.

ఆంధ్రాకిచిడి

కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మందికి ఇష్టం. అంతే కాదు సులభంగా తయారు చేసుకోగల వంటకం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొంటే శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి. ఎందుకంటే దీనిలో ఉపయోగించి పెసరపప్పు, నెయ్యి, మిరియాలు, జీలకర్ర వంటివి మంచి పోషకాంశాలతో పాటు, జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. మరి ఈ స్పెషల్ టేస్టీ ఆంధ్రా కిచిడిని ఎలా తయారు చేయాలో చూద్దాం...


బాస్మతి రైస్:11/ 2cups
పెసరపప్పు: 1/ 2cup
నెయ్యి: 1tbsp
జీలకర్ర: 1tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
మిరియాలు: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 31/2cup
జీడిపప్పు: 12(నెయ్యిలో గోధుమరంగు వచ్చేంత వరకూ వేగించుకోవాలి.

తయారు చేయు విదానం:

1. ముందుగా బియ్యం, పెసరపప్పుని కడిగి, 15నిముషాలు నీళ్ళలో నానబెట్టాలి.
2. తర్వాత మందపాటి గిన్నెలో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, మిరియాలు వేసి వేయించుకోవాలి.
3. తర్వాత ముందుగా నానబెట్టుకొన్న బియ్యం పప్పులో నీళ్ళు వంపి, పోపులో వేసి కలియబెట్టాలి.
4. ప్రెజర్ కుక్కర్ లో అయితే రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. పాత్రలో అయితే అన్నం అయ్యే వరకూ ఉంచి దింపేయాలి.
5. నేతిలో వేయించి పెట్టుకొన్న జీడిపప్పుతో గార్నిష్ చేసి టమోటో చట్నీ కాంబినేషన్ తో వేడి వేడిగా వడ్డించాలి. అంతే ఆంధ్రా కిచిడి రెడీ.

Thursday, August 15, 2013

పన్నీర్ పకోడీ

పన్నీర్ పకోడీ కావలసిన పదార్దాలు:-
పన్నీర్ : వంద గ్రాములు
శెనగ పిండి : వంద గ్రాములు
ఉల్లి ముక్కలు : అర కప్పు
పచ్చిమిర్చి : రెండు
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
కారం : పావు కప్పు
అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
నూనె : వేయించటానికి సరిపడ
బియ్యప్పిండి : టేబుల్ స్పూన్ 
తయారు చేయు విధానం:-
1) పన్నీర్ చిన్నగా కట్ చేసి గిన్నెలో వేయ్యాలి.(తురుముకున్న బాగానే వుంటుంది )
2) వీటిలోనే ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర,పసుపు, శెనగ పిండి, బియ్యప్పిండి వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి పకోడీ పిండిలా కలపాలి.
3) స్టవ్ మీద కలాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక కలిపిన పిండిని పకోడిలా వేసి దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోని ఉల్లిచక్రాలతో సర్వ్ చెయ్యాలి.

Thursday, August 8, 2013

స్వీట్ గవ్వలు

మైదా లేదా గోధుమపిండి - కప్పు,
బొంబాయిరవ్వ - టేబుల్ స్పూను,
బెల్లం తురుము - అర కప్పు,
నెయ్యి - టేబుల్ స్పూను,
నూనె - వేయించడానికి సరిపడేంత

స్వీట్ గవ్వలు తయారి:-
ఒక పెద్ద పాత్రలో మైదా లేదా గోధుమపిండి, బొంబాయిరవ్వ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరవాత నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్ద గట్టిగా కాకుండా మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనిని అరగంటసేపు నాననివ్వాలి. నానిన ముద్దను చిన్న ఉండలుగా చేసి, గవ్వలపీట మీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు పోసి ముదురుపాకం వచ్చాక, వేయించిన గవ్వలను పాకంలో వేసి బాగా కలపాలి.

Wednesday, August 7, 2013

క్యారెట్ పూరీ

గోధుమ పిండి - 2 కప్పు,
క్యారెట్ తురుము - అరకప్పు,
ఉప్పు- తగినంత,
జీలకర్ర - 2 టీస్పూన్,
నెయ్యి -2 టేబుల్ స్పూన్,
పచ్చి మిర్చి (తరిగినవి) లేదా మిర్చి పౌడర్ - అర టీస్పూన్,
ఆయిల్ - తగినంత.

క్యారెట్ పూరీ తయారు చేసే విధానం :-

గోధుమ పిండిలో ఉప్పు చేర్చి కలపాలి, అందులో నెయ్యి, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి లేదా మిర్చి పౌడర్, చేర్చి బాగా కలిపి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వాటిని రౌండ్‌గా రుద్ది వేడి వేడి నూనెలో వేయాలి. క్యారెట్ పూరీలు కాల్చిన తర్వాత పుదీనా పచ్చడి లేదా టమోటా సార్స్‌తో తింటే ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. అలసిన కళ్ళు ఉత్సాహాని పొందేందుకు క్యారెట్ పూరీ తినచ్చు.

క్రిస్పీ పల్లీ పకోడీ :

కావల్సిన పదార్థాలు:
పల్లీలు: 2cups శెనగపిండి: 1.5cup
కరివేపాకు: మూడు రెమ్మలు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
మిరపపొడి: 1tsp ధనియాలపొడి: 1/2tsp
గరంమసాలా: 1/2tsp అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కొత్తిమీర: చిన్న కట్ట

తయారు చేయు విధానం: 
1. ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. 2. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. 3. తర్వాత పాన్ లో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. దీనిని పల్లీ చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి. అంతే పల్లీ పకోడీ రెడీ..

బ్రెడ్ ‌మసాలా కూర

బ్రెడ్ ‌మసాలా కూర
కావల్సినవి: 
బ్రెడ్‌- ప్యాకెట్‌ ఒకటి, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, కారం- పావు చెంచా, మిరియాలపొడి- పావుచెంచా, కూరగాయలు ఉడికించిన నీళ్లు- అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ: 
బ్రెడ్‌ అంచులను తొలగించి నాలుగు ముక్కలుగా తుంచి పక్కన పెట్టుకోవాలి. తరవాత బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి మూత పెట్టాలి. కొద్దిసేపటికి గ్రేవీ తయారవుతుంది. అందులో బ్రెడ్‌ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. బ్రెడ్‌ ముక్కలకు మసాలా కూర పట్టాక దించేస్తే సరిపోతుంది. దీన్ని అన్నంలోనే కాదు చపాతీలోకీ తీసుకోవచ్చు.

Friday, August 2, 2013

దహీ పూరీ

కావలసినవి:

పూరీలు - 20 (పానీ పూరీలు)
పుల్లటి గడ్డ పెరుగు - అర కప్పు
ఉడకబెట్టిన బంగాళదుంపలు - అర కప్పు (చిదమాలి)
ఉడకబెట్టిన బఠాణీ - అర కప్పు
జీలకర్ర - టీ స్పూన్
కారం - టీ స్పూన్
గరం మసాలా - టీ స్పూన్
స్వీట్ చట్నీ - అర కప్పు
నూనె - తగినంత
పంచదార - టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత

గార్నిషింగ్ కోసం:
సన్న కారప్పూస - కప్పు
కారం - చిటికెడు
ఉప్పు - చిటికెడు
నల్ల ఉప్పు - చిటికెడు
జీలకరప్రొడి - చిటికెడు
కొత్తిమీర తరుగు - తగినంత

తయారి: 


పెరుగులో పంచదార, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, బంగాళదుంప ముద్ద, పసుపు, ఉప్పు, కారం, గరంమసాలా వేసి కొంచెం సేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పూరీలో కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దని స్టఫ్ చేయాలి. అందులో గ్రైండ్ చేసిన పెరుగు, బఠాణీలు, స్వీట్ చట్నీ వేసి పైన సన్న కారప్పూస, కారం, ఉప్పు, జీలకరప్రొడి, నల్ల ఉప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.