Thursday, June 20, 2013

రాగి సంకటి :

రాగి సంకటి :

భారతదేశంలో ఎక్కువగా వరి అన్నం తింటారు. కాని అందులో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే అధిక శాతం మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతూ ఉంటారు. కాని బియ్యంతో పోలిస్తే రాగులలోనే ఎక్కువ పోషక పదార్ధాలు ఉన్నాయి. అందుకే డాక్టర్లు కూడా జబ్బు పడినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు రాగి జావ , సంకటి లేదా రొట్టెలు తినమంటారు. అంతే కాదు రాగి అంబలి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారు. మజ్జిగతో చేసిన రాగి అంబలి వేసవిలో చాలా మంచిది. అది వేడిని తగ్గిస్తుంధి.. తెలుగువారికందరికి బాగా పరిచయమైన, ఇష్టమైన రాగి సంకటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మరి. చాలా సులువు..
కావలసిన వస్తువులు:

రాగి పిండి – 1 కప్పు
బియ్యం – ½ కప్పు
ఉప్పు – తగినంత

అరకప్పు బియ్యంలో రెండు కప్పుల నీళ్లు పోసి చాలా మెత్తగా ఉడికించాలి. మళ్లీ ఇంకో కప్పు నీళ్లు పోసి ఉడికించి నీరంతా ఇగిరిపోకముందే మంట తగ్గించి అన్నంపైన రాగిపిండి సమానంగా పోసి మూతపెట్టాలి. మంట తగ్గించి 5 నిమిషాలు అలాగే ఉడికించాలి. అందులో ఉన్న నీటి వేడికి రాగిపిండి పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మొత్తం అన్నం, రాగిపిండి కలిసి మెత్తగా ముద్దలా అయ్యేంతవరకు పప్పు గుత్తితో మెదపాలి. ఇది చాలా వేగంగా, వేడిగా ఉన్నప్పుడే చేయాలి. ఇందులో అన్నం, పిండి కలిసిపోయి ముద్దలా అవ్వాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తడి చేతులతో గుండ్రంగా ముద్దలు చేసుకుని పప్పు, పచ్చిపులుసు, పల్లీ పచ్చడి లేదా కోడికూర, మటన్, చేపల పులుసుతో వడ్డించాలి..

కొన్ని చిట్కాలు :

దీనికోసం వండిన అన్నం, ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే కూడా ఉపయోగించవచ్చు. అన్నంలో మరిన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించి రాగిపిండి కలపాలి.

సగం రాగిపిండి నీళ్లల్లో కలిపి అన్నంలో వేయాలి. మిగతాపిండి అలాగే అన్నంమీద పోయాలి. తర్వాత మెదపాలి.

ఈ సంకటి లేదా ముద్ద చిన్నగిన్నెకంటే పెద్ద గిన్నెలో తయారు చేసుకుంటే తడి చేసుకుని ముద్దలు చేయడం సులువవుతుంది..

0 comments:

Post a Comment